Jitesh Sharma: ప్రీతీ జింటా నాకు అక్క లాంటిది: క్రికెటర్ జితేశ్ శర్మ

Jitesh Sharma considers Preity Zinta as his sister
షార్ట్స్‌లో చూడండి
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఫ్రాంచైజీ పంజాబ్ కింగ్స్ సహ యజమాని ప్రీతి జింటాను తాను సోదరిలా భావిస్తానని భారత వికెట్ కీపర్ బ్యాటర్ జితేశ్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇటీవల జరిగిన ఐపీఎల్ వేలంలో తనను పంజాబ్ జట్టు తిరిగి దక్కించుకోలేకపోయినప్పుడు, ప్రీతి వ్యక్తిగతంగా ఫోన్ చేసి 'సారీ' చెప్పారని ఓ పాడ్‌కాస్ట్‌లో గుర్తుచేసుకున్నాడు.

జితేశ్ శర్మ మాట్లాడుతూ, "నేను ప్రీతి జింటాను చాలా గౌరవిస్తాను. ఆమె నాకు తరచుగా ఫోన్లు, మెసేజ్‌లు చేస్తుంటారు. ఆమెను నా పెద్దక్కలా చూస్తాను. నేను హిమాచల్ ప్రదేశ్ వాడినని తెలిశాక మా మధ్య బంధం మరింత బలపడింది. ఎందుకంటే ఆమె కూడా అదే రాష్ట్రానికి చెందినవారు. మేం గంటల తరబడి మాట్లాడుకునేవాళ్లం. ఆమె చాలా మంచి వ్యక్తి" అని వివరించాడు. తన కెరీర్‌ను నిలబెట్టింది పంజాబ్ కింగ్స్ జట్టేనని జితేశ్ భావోద్వేగంగా చెప్పాడు.

"నా కెరీర్‌లో పంజాబ్ కింగ్స్ పాత్ర చాలా కీలకమైనది. ఐపీఎల్ వేలంలో నాకోసం వచ్చిన ఏకైక బిడ్ పంజాబ్ నుంచే. ఆ జట్టు నన్ను నమ్మి తీసుకుంది. కేవలం రెండు మ్యాచ్‌ల తర్వాత తుది జట్టులో అవకాశం ఇచ్చింది. ఈ రోజు నేను ఈ స్థాయిలో ఉన్నానంటే దానికి పంజాబ్ కింగ్స్ జట్టే కారణం. ఆ జట్టుకు ఎప్పటికీ రుణపడి ఉంటాను" అని జితేశ్ తన కృతజ్ఞతను చాటుకున్నాడు.

2025 ఐపీఎల్ వేలంలో, పంజాబ్ కింగ్స్ 'రైట్ టు మ్యాచ్' కార్డును ఉపయోగించి జితేశ్‌ను రూ.7 కోట్లకు అట్టిపెట్టుకోవాలని ప్రయత్నించింది. అయితే, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) ఏకంగా రూ.11 కోట్లకు బిడ్ వేసి అతడిని సొంతం చేసుకుంది. ఈ ఘటన తర్వాత ప్రీతి జింటా తనకు ఫోన్ చేసి, "సారీ జితేశ్.. వేలంలో నిన్ను దక్కించుకోలేకపోయాం" అని బాధపడినట్లు జితేశ్ వెల్లడించాడు. తాను కూడా పంజాబ్ కింగ్స్‌తోనే ఉండాలనుకున్నానని, అయితే ఆర్‌సీబీకి వెళ్లడం కూడా నీ కెరీర్‌కు మంచిదేనని ప్రీతి సంతోషం వ్యక్తం చేశారని తెలిపాడు. ప్రస్తుతం కూడా ఆమెతో టచ్‌లో ఉన్నానని, తమ మధ్య అనుబంధం ఇప్పటికీ కొనసాగుతోందని వివరించాడు.
Go Back to Shorts
Jitesh Sharma
Preity Zinta
Punjab Kings
IPL Auction 2025
Royal Challengers Bangalore
Cricket
Indian Premier League
IPL
Right to Match card

More Telugu News