Harish Rao: ఇక్రిశాట్‌పై రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు... తెలంగాణ పరువు తీయొద్దన్న హరీశ్ రావు

Harish Rao Criticizes Revanth Reddy Remarks on ICRISAT
షార్ట్స్‌లో చూడండి
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. దశాబ్దాలుగా అంతర్జాతీయ ఖ్యాతి పొందిన ఇక్రిశాట్‌ (ICRISAT)ను అమెరికాకు చెందిన సంస్థగా సీఎం అభివర్ణించడం ఆయన అవగాహన రాహిత్యానికి నిదర్శనమని ఎద్దేవా చేశారు. కనీస వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడి తెలంగాణ పరువు తీయవద్దని హితవు పలికారు. ఈ మేరకు హరీశ్ రావు ఒక ప్రకటన విడుదల చేశారు.

1972 నుంచి పటాన్‌చెరు కేంద్రంగా పనిచేస్తున్న ప్రపంచ ప్రఖ్యాత సంస్థ గురించి కూడా సీఎంకు స్పష్టత లేకపోవడం బాధాకరమన్నారు. ఇక్రిశాట్ అనేది ఏ ఒక్క దేశానికీ చెందినది కాదని, అది ఒక స్వతంత్ర, లాభాపేక్ష లేని అంతర్జాతీయ పరిశోధనా సంస్థ అని హరీశ్ రావు స్పష్టం చేశారు. ఈ సంస్థ ఏర్పాటులో ఐక్యరాజ్యసమితికి చెందిన ఆహార, వ్యవసాయ సంస్థ (FAO), ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం (UNDP)తో పాటు ప్రపంచ బ్యాంకు కీలక పాత్ర పోషించాయని గుర్తుచేశారు. ప్రారంభ దశలో ఫోర్డ్, రాక్‌ఫెల్లర్ ఫౌండేషన్ల సహకారంతో పాటు, భారత ప్రభుత్వం సహా అనేక దేశాల మద్దతుతో నడుస్తున్న ఒక గ్లోబల్ వేదికను ‘అమెరికా రీసెర్చ్ సెంటర్’ అని ఎలా అంటారని ఆయన ప్రశ్నించారు.

కేవలం ఇక్రిశాట్ విషయంలోనే కాకుండా, నల్లమల సరిహద్దులు, కృష్ణా-గోదావరి జలాలు, సుంకేసుల ప్రాజెక్టుల వంటి కీలక అంశాలపై కూడా సీఎంకు సరైన అవగాహన లేదని హరీశ్ రావు ఆరోపించారు. ఇంతటి ప్రాథమిక విషయాలు కూడా తెలియని స్థితిలో రాష్ట్రాన్ని నడపడం వల్ల తెలంగాణ ప్రయోజనాలు తీవ్రంగా దెబ్బతింటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. 

ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి చేసే ప్రతి వ్యాఖ్య బాధ్యతాయుతంగా, వాస్తవాల ఆధారంగా ఉండాలని సూచించారు. ఇప్పటికైనా నోటికి ఏది వస్తే అది మాట్లాడటం మానుకుని, వాస్తవాలు తెలుసుకుని మాట్లాడటం అలవాటు చేసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డికి హరీశ్ రావు ఘాటుగా హితవు పలికారు.


Go Back to Shorts
Harish Rao
Revanth Reddy
ICRISAT
Telangana
Agriculture Research
Patancheru
FAO
UNDP
World Bank
Telangana Politics

More Telugu News