British Airways: విమానంలో ప్రయాణికురాలి మృతి.. హీటెడ్ ఫ్లోర్‌పై మృతదేహం.. దుర్వాసనతో ప్ర‌యాణికుల‌కు నరకం!

Passenger Dies on British Airways Flight Body Placed on Heated Floor
షార్ట్స్‌లో చూడండి
బ్రిటిష్ ఎయిర్‌వేస్ విమానంలో ఒక సంఘటన ప్రయాణికులను తీవ్ర ఇబ్బందులకు గురిచేసింది. హాంగ్‌కాంగ్ నుంచి లండన్ వెళుతున్న విమానంలో 60 ఏళ్ల మహిళ టేకాఫ్ అయిన కొద్దిసేపటికే మరణించారు. అయితే, విమానాన్ని వెనక్కి మళ్లించకుండా, దాదాపు 12 గంటల పాటు మృతదేహంతోనే ప్రయాణం కొనసాగించడం, ఆ తర్వాత జరిగిన పరిణామాలు విమర్శలకు దారితీశాయి.

వివరాల్లోకి వెళితే... బ్రిటిష్ ఎయిర్‌వేస్‌కు చెందిన బీఏ32 విమానం హాంగ్‌కాంగ్ నుంచి లండన్‌కు బయలుదేరింది. ప్రయాణం ప్రారంభమైన గంటకే 60 ఏళ్ల మహిళ మరణించినట్లు సిబ్బంది నిర్ధారించారు. సాధారణంగా ప్రయాణంలో ఎవరైనా మరణిస్తే దానిని మెడికల్ ఎమర్జెన్సీగా పరిగణించరు. ఈ నేపథ్యంలో పైలట్లు విమానాన్ని వెనక్కి మళ్లించడం గానీ, సమీప విమానాశ్రయంలో ల్యాండ్ చేయడం గానీ చేయకుండా లండన్‌కు ప్రయాణాన్ని కొనసాగించాలని నిర్ణయించారు.

మృతదేహాన్ని తొలుత లావెటరీలో ఉంచాలని భావించినా, ఆ తర్వాత విమానం వెనుక భాగంలో ఉన్న గ్యాలీలోకి మార్చారు. అయితే, సిబ్బంది ఒక ముఖ్యమైన విషయాన్ని గమనించలేదు. మృతదేహాన్ని ఉంచిన గ్యాలీ ఫ్లోర్ వేడిని ఉత్పత్తి చేసే వ్యవస్థను (హీటెడ్ ఫ్లోర్) కలిగి ఉంది. విమానం గంటల తరబడి ప్రయాణిస్తున్న కొద్దీ, ఆ వేడి కారణంగా మృతదేహం నుంచి తీవ్రమైన దుర్వాసన వెలువడటం ప్రారంభమైంది. విమానం వెనుక భాగమంతా ఈ వాసన వ్యాపించడంతో ప్రయాణికులు, సిబ్బంది తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. 

విమానం లండన్‌లోని హీత్రూ విమానాశ్రయంలో ల్యాండ్ అయిన వెంటనే, పోలీసులు విమానంలోకి ప్రవేశించి ప్రయాణికులందరినీ సుమారు 45 నిమిషాల పాటు సీట్లలోనే కూర్చోమని ఆదేశించారు. ఈ ఘటనపై బ్రిటిష్ ఎయిర్‌వేస్ స్పందిస్తూ, ప్రయాణికురాలి మృతి పట్ల విచారం వ్యక్తం చేసింది. నిబంధనల ప్రకారమే తమ సిబ్బంది అన్ని చర్యలు తీసుకున్నారని, వారికి అండగా ఉంటామని ఒక ప్రకటనలో తెలిపింది. 

అంతర్జాతీయ నిబంధనల ప్రకారం విమానంలో ఎవరైనా మరణిస్తే, మృతదేహాన్ని వీలైనంత వరకు ప్రయాణికులకు దూరంగా, ఖాళీ సీటులో లేదా వేరే సెక్షన్‌లో ఉంచాల్సి ఉంటుంది. విమానం పూర్తిగా నిండి ఉంటే మాత్రం అసలు సీటులోనే ఉంచుతారు.
Go Back to Shorts
British Airways
Hong Kong to London flight
passenger death
flight death
heated floor
Heathrow Airport
BA32 flight
medical emergency
flight regulations
mortality mid-flight

More Telugu News