Emirates: దుబాయ్ వెళ్తూ మధ్యలోనే వెనక్కి మళ్లిన ఎమిరేట్స్ విమానాలు!

Emirates Flights Return MidAir After Dubai Airport Drone Attack
దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలోని ఒక చమురు ట్యాంకర్‌పై ఇరాన్ ఈ రోజు ఉదయం డ్రోన్ దాడి చేయడంతో భారీగా మంటలు చెలరేగాయి. దీంతో భద్రతా కారణాల దృష్ట్యా దుబాయ్ విమానాశ్రయాన్ని తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ పరిణామంతో కేరళం నుంచి దుబాయ్ వెళ్లిన విమానాలకు ఆటంకం కలిగింది. తిరువనంతపురం నుంచి దుబాయ్ బయలుదేరి వెళ్లిన ఎమిరేట్స్ విమానం (EK 523) విమానాశ్రయం మూసివేత సమాచారంతో వెనక్కి మళ్లింది.

353 మంది ప్రయాణికులు, 19 మంది సిబ్బందితో ఉన్న ఈ విమానం తిరిగి తిరువనంతపురంలోనే సురక్షితంగా ల్యాండ్ అయింది. కొచ్చి నుంచి 325 మంది ప్రయాణికులతో బయల్దేరిన మరో ఎమిరేట్స్ విమానం (EK 533) కూడా నాలుగు గంటల ప్రయాణం తర్వాత తిరిగి కొచ్చికే చేరుకుంది. హైదరాబాద్ నుంచి వెళ్లిన ఎమిరేట్స్ విమానం (EK 525) కూడా ఇదే విధంగా వెనక్కి మళ్లినట్లు సమాచారం. ఎయిర్ ఇండియా కూడా దుబాయ్ నుంచి రాకపోకలు సాగించే తన విమాన సర్వీసులన్నింటినీ తాత్కాలికంగా రద్దు చేసింది.

దుబాయ్ మీడియా ఆఫీస్ వెల్లడించిన వివరాల ప్రకారం.. డ్రోన్ దాడి వల్ల విమానాశ్రయం సమీపంలోని ఇంధన నిల్వ కేంద్రంలో మంటలు చెలరేగాయి, అయితే ఎవరికీ గాయాలు కాలేదు. ప్రస్తుతం మంటలను అదుపులోకి తెచ్చేందుకు సివిల్ డిఫెన్స్ బృందాలు పనిచేస్తున్నాయి. యుద్ధం ప్రారంభమైన తర్వాత దుబాయ్ విమానాశ్రయంపై ఇరాన్ దాడి చేయడం ఇది మూడోసారి కావడం గమనార్హం. ప్రయాణికులు ఎయిర్‌లైన్స్ నుంచి తాజా అప్డేట్స్ పొందిన తర్వాతే ప్రయాణాలకు సిద్ధం కావాలని అధికారులు సూచించారు.
Emirates
Dubai Airport
drone attack
flight cancellations
Iran
oil tanker fire
Kerala
Air India
flight diversions
Middle East

More Telugu News