Sajjanar: సంక్షోభం వేళ, గ్యాస్ బుకింగ్ పేరుతో సైబర్ మోసాల పట్ల జాగ్రత్తగా ఉండండి: సజ్జనార్

Sajjanar Warns Against Gas Booking Cyber Frauds
  • 'ఎక్స్' వేదికగా హెచ్చరించిన హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్
  • గ్యాస్ కొరత ఉందన్న ఆందోళనను సైబర్ కేటుగాళ్లు అనుకూలంగా మార్చుకుంటున్నారన్న సజ్జనార్
  • తక్షణమే సిలిండర్ డెలివరీ చేస్తామంటూ నకిలీ ప్రకటనలు వస్తున్నాయని హెచ్చరిక
గ్యాస్ బుకింగ్ పేరుతో మోసాలు చేసేవారి పట్ల జాగ్రత్తగా ఉండాలని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ హెచ్చరించారు. ఈ మేరకు ఆయన 'ఎక్స్' వేదికగా ఈ కొత్త తరహా మోసాల పట్ల అప్రమత్తం చేశారు. వంట గ్యాస్ సిలిండర్ల కొరత ఉందన్న ఆందోళనను సైబర్ కేటుగాళ్లు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారని, గ్యాస్ బుకింగ్ కోసం ఆన్‌లైన్‌లో వెతికే అమాయకులే లక్ష్యంగా కొత్త తరహా మోసాలకు తెరతీశారని తెలిపారు.

తక్షణమే సిలిండర్ డెలివరీ చేస్తామంటూ, అదనపు సిలిండర్లు ఇస్తామంటూ సామాజిక మాధ్యమాల్లో నకిలీ ప్రకటనలు ఇస్తూ బురిడీ కొట్టిస్తున్నారని, వాట్సాప్, ఎస్సెమ్మెస్‌ల ద్వారా ఫేక్ వెబ్‌సైట్ లింకులను పంపిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని పేర్కొన్నారు. ముఖ్యంగా, ఆన్‌లైన్‌లో ముందుగా డబ్బులు చెల్లిస్తే గ్యారెంటీగా, అత్యవసరంగా గ్యాస్ సరఫరా చేస్తామని నమ్మబలికే సందేశాలు వస్తే అవి కచ్చితంగా సైబర్ మోసాలేనని గ్రహించాలని ప్రజలకు సూచించారు.

ఇలాంటి అనుమానాస్పద లింకులను ఎట్టి పరిస్థితుల్లోనూ క్లిక్ చేయకూడదని సూచించారు. సిలిండర్ బుకింగ్ లేదా ఆన్‌లైన్ చెల్లింపుల కోసం గ్యాస్ కంపెనీల అధికారిక వెబ్‌సైట్లను లేదా అధీకృత గ్యాస్ ఏజెన్సీలను మాత్రమే ఆశ్రయించాలని అన్నారు. ఆకర్షణీయమైన ఆఫర్లు చూసి గుర్తుతెలియని వ్యక్తులకు మీ బ్యాంక్ ఖాతా వివరాలు, ఓటీపీ, యూపీఐ పిన్ వంటివి ఎట్టి పరిస్థితుల్లోనూ పంచుకోకూడదని సూచించారు.

నకిలీ వెబ్‌సైట్లలో వివరాలు నమోదు చేయడం ద్వారా మీ వ్యక్తిగత, ఆర్థిక సమాచారం సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కి బ్యాంక్ ఖాతాలు ఖాళీ అయ్యే ప్రమాదం ఉందని సజ్జనార్ పేర్కొన్నారు. ఒకవేళ ఎవరైనా ఇలాంటి సైబర్ మోసాలకు గురైతే ఏమాత్రం ఆలస్యం చేయకుండా తక్షణమే జాతీయ సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ నెంబర్ 1930 కి కాల్ చేయాలని లేదా http://cybercrime.gov.in వెబ్‌సైట్‌లో ఫిర్యాదు చేయాలని సూచించారు.
Sajjanar
Cyber crime
Gas booking scam
Hyderabad police
Online fraud
Cyber security
Gas cylinder

More Telugu News