Gyanesh Kumar: అర్హత కలిగిన ఏ ఒక్కరి పేరును ఓటరు జాబితా నుంచి తొలగించబోం: కేంద్ర ఎన్నికల సంఘం

Gyanesh Kumar No Eligible Voter Name Will Be Removed From Voter List
  • పశ్చిమ బెంగాల్‌లో రాజకీయ పార్టీలు, అధికారులతో కేంద్ర ఎన్నికల సంఘం సమావేశం
  • ఓటరు జాబితా నుంచి అర్హత కలిగిన ఏ ఒక్క పేరును తొలగించబోమని హామీ
  • ఓటర్ల జాబితాలో తప్పులు లేకుండా చూడటమే ఎస్ఐఆర్ బాధ్యత అన్న ఈసీ
అర్హత కలిగిన ఏ ఒక్కరి పేరును ఓటరు జాబితా నుంచి తొలగించబోమని కేంద్ర ఎన్నికల ప్రధానాధికారి జ్ఞానేశ్ కుమార్ అన్నారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల నిమిత్తం సీఈసీ బృందం ఆ రాష్ట్రంలో పర్యటించింది. ఈ క్రమంలో రాజకీయ పార్టీలు, అధికారులతో సమావేశాల అనంతరం జ్ఞానేశ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. ఓటరు జాబితా నుంచి అర్హత కలిగిన ఏ ఒక్క ఓటరు పేరును తొలగించబోమని అన్నారు.

పశ్చిమ బెంగాల్‌లో స్వేచ్ఛగా, ప్రశాంతంగా ఎన్నికలు జరిగేలా చూడటమే ఎన్నికల సంఘం మొదటి ప్రధాన్యం అన్నారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును ఉపయోగించుకునే అవకాశం ఉంటుందని అన్నారు. అర్హత కలిగిన ఓటర్ల పేర్ల తొలగింపు ఉండబోదని స్పష్టం చేశారు. రాజ్యాంగంలోని నిబంధనల ప్రకారమే అన్ని రాష్ట్రాల్లో ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) అమలవుతోందని అన్నారు.

ఓటర్ల జాబితాలో తప్పులు లేకుండా చూడటం, అర్హులైన వారి పేర్లు ఆ జాబితాలో ఉండేలా చూడటమే 'ఎస్ఐఆర్' ఉద్దేశమని అన్నారు. ఎన్నికలు ఎన్ని దశల్లో నిర్వహించాలనేది బెంగాల్‌లో రాష్ట్ర ప్రభుత్వం శాంతిభద్రతల విషయంలో చేపట్టే చర్యలపై ఆధారపడి ఉంటుందని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులంతా ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు విధులు నిర్వర్తించాలని అన్నారు.

ఓటర్లపైనా, ఎన్నికల అధికారులపైనా రాజకీయ నేతలు ఎలాంటి బెదిరింపులకు పాల్పడినా ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో 80 వేల పోలింగ్ స్టేషన్లు ఉన్నాయని, వాటిల్లో దాదాపు 61,000 గ్రామీణ ప్రాంతాల్లోనే ఉన్నట్లు తెలిపారు. ఓటింగ్ ప్రక్రియ పారదర్శకతను పెంపొందించేందుకు రాష్ట్రంలోన్ని అన్ని పోలింగ్ బూత్‌లలో ఎలాంటి అవకతవకలు జరగకుండా వెబ్ కాస్టింగ్ ప్రక్రియను అమలు చేస్తామని తెలిపారు.
Gyanesh Kumar
West Bengal Elections
Election Commission of India
Voter List
Voter Deletion

More Telugu News