Amit Shah: ఈ నెలాఖరు నాటికి నక్సలిజం పీడ విరగడవుతుంది: అమిత్ షా
- దేశాన్ని నక్సలిజం రహితంగా మార్చే ప్రక్రియ తుది దశకు చేరుకుందన్న అమిత్ షా
- సీఆర్‌పీఎఫ్, కోబ్రా బెటాలియన్లపై ప్రశంసలు
- ఆయుధాలు పట్టే వారికి ఆయుధాలతోనే సమాధానం ఇస్తామని హెచ్చరిక
దేశంలో వామపక్ష తీవ్రవాదాన్ని పూర్తిగా తుడిచిపెట్టేస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా మరోసారి స్పష్టం చేశారు. ఒడిశాలోని కటక్‌లో జరిగిన సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్) 57వ రైజింగ్ డే వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఈ మార్చి నెలాఖరు నాటికి భారతదేశం మావోయిజం నుంచి పూర్తి విముక్తి పొందుతుందని ధీమా వ్యక్తం చేశారు. గతంలోనే నిర్ణయించుకున్న లక్ష్యం ప్రకారం, దేశాన్ని నక్సలిజం రహితంగా మార్చే ప్రక్రియ తుది దశకు చేరుకుందని ఆయన వివరించారు. ముఖ్యంగా ఒకప్పుడు మావోయిస్టులు కలలుగన్న 'తిరుపతి నుంచి పశుపతి' వరకు రెడ్ కారిడార్‌ను నిర్మించాలనే కలలను భద్రతా దళాలు పూర్తిగా నాశనం చేశాయని కొనియాడారు.
నక్సలిజం పీడను వదిలించడంలో సీఆర్‌పీఎఫ్, కోబ్రా బెటాలియన్ల అసాధారణ కృషిని అమిత్ షా ప్రశంసించారు. భద్రతా దళాల పటిష్ట వ్యూహాల వల్ల నక్సల్స్ ప్రభావం ఇప్పుడు చాలా తక్కువ ప్రాంతాలకు, అది కూడా కొన్ని మారుమూల ప్రాంతాలకే పరిమితమైందని పేర్కొన్నారు. అభివృద్ధికి అడ్డుపడుతూ, పాఠశాలలు, ఆసుపత్రులను ధ్వంసం చేసే మావోయిస్టుల పట్ల ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడదని ఆయన హెచ్చరించారు. ఆయుధాలు పట్టి అమాయకులను పొట్టనబెట్టుకునే వారికి ఆయుధాలతోనే సమాధానం చెబుతామని హోం మంత్రి కఠిన హెచ్చరికలు జారీ చేశారు.
మావోయిజం వల్ల దశాబ్దాలుగా వెనుకబడిన గిరిజన ప్రాంతాల్లో ఇప్పుడు అభివృద్ధి పరుగులు తీస్తోందని అమిత్ షా వివరించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ వంటి మారుమూల ప్రాంతాల్లో ఇప్పుడు రోడ్లు, విద్యుత్, మొబైల్ కనెక్టివిటీ వంటి మౌలిక సదుపాయాలు వేగంగా అందుబాటులోకి వస్తున్నాయని తెలిపారు. ఒకప్పుడు హింసకు నిలయంగా ఉన్న ఆ ప్రాంతాలు ఇప్పుడు అభివృద్ధికి చిహ్నాలుగా మారుతున్నాయని, గిరిజన బిడ్డలకు ఉపాధి, విద్యావకాశాలు కల్పించడమే తమ ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు.