సురక్షితంగా ఇండియాకు చేరుకున్న పీవీ సింధు

PV Sindhu Safely Reaches India Amidst Middle East Crisis
  • యుద్ధం గుప్పిట్లో చిక్కుకున్న గల్ఫ్ దేశాలు
  • దుబాయ్ విమానాశ్రయంలో చిక్కుకున్న పీవీ సింధు
  • సింధును సురక్షిత ప్రాంతానికి తరలించిన భారత రాయబార కార్యాలయం
  • క్షేమంగా బెంగళూరుకు చేరుకున్న సింధు

అమెరికా, ఇజ్రాయెల్ - ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధం గల్ఫ్ దేశాలను అతలాకుతలం చేస్తోంది. వైమానిక దాడులతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పరాకాష్ఠకు చేరాయి. ఈ క్రమంలో యూఏఈ గగనతలాన్ని తాత్కాలికంగా మూసివేయడంతో గత మూడు రోజులుగా వేలాది మంది భారతీయులు దుబాయ్, అబుదాబి విమానాశ్రయాల్లోనే చిక్కుకుపోయారు. అయితే, పరిస్థితులు కొంత మెరుగు పడటంతో ఎతిహాద్ ఎయిర్‌వేస్ ప్రత్యేక విమానాలను ప్రారంభించింది. అబుదాబి నుంచి 300 మంది ప్రయాణికులతో బయలుదేరిన తొలి విమానం తాజాగా ఢిల్లీ చేరుకోగా, ముంబై, బెంగళూరు, కొచ్చి నగరాలకు కూడా మరో మూడు విమానాలు చేరుకున్నాయి. 


ఈ సంక్షోభంలో భారత బ్యాడ్మింటన్ దిగ్గజం పీవీ సింధు త్రుటిలో ప్రాణాపాయం నుండి తప్పించుకుంది. ఆల్ ఇంగ్లాండ్ ఓపెన్ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొనేందుకు బ్రిటన్ వెళ్తున్న క్రమంలో దుబాయ్‌లో విమాన సర్వీసులు నిలిచిపోవడంతో ఆమె తన సిబ్బందితో కలిసి అక్కడే ఉండిపోయింది. ఆ సమయంలో విమానాశ్రయానికి సమీపంలోనే బాంబు పేలుళ్లు సంభవించాయి. తమ సమీపంలోనే బాంబు పడిన విషయాన్ని సింధు కూడా స్వయంగా వెల్లడించింది. 


మరోవైపు, వెంటనే స్పందించిన భారత రాయబార కార్యాలయం ఆమెను సురక్షిత ప్రాంతానికి తరలించింది. తాజాగా పునఃప్రారంభమైన విమాన సర్వీసుల ద్వారా సింధు తన టీమ్‌తో కలిసి సురక్షితంగా బెంగళూరుకు చేరుకుంది. ఈ క్లిష్ట సమయంలో తనకు అండగా నిలిచిన భారత ప్రభుత్వం, ఎంబసీ అధికారులకు ఆమె ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసింది. యుద్ధం కారణంగా అంతర్జాతీయ విమాన సర్వీసులు ఇంకా పూర్తిస్థాయిలో పునరుద్ధరించబడకపోవడంతో మిగిలిన వారిని తరలించేందుకు కేంద్రం ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది.

Go Back to Shorts
PV Sindhu
PV Sindhu safely returns
India
Dubai
Abu Dhabi
UAE
All England Open Championship
Indian Embassy
Evacuation
Flight services

More Telugu News