Kesineni Srinivas: మళ్లీ ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యే .. ఆలయంలో కేశినేని చేతి నుంచి పట్టువస్త్రాలు లాక్కున్న కొలికపూడి

Kesineni Chinni vs Kollikuppdi Srinivasarao Clash at Temple
  • నెమలి వేణుగోపాలస్వామి కల్యాణోత్సవంలో ఘటన
  •  ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట
  •  అధిష్ఠానం జోక్యం చేసుకున్నా వీడని నేతల మధ్య విభేదాలు
విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని), తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు మధ్య విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. టీడీపీ అధిష్ఠానం జోక్యం చేసుకున్నా చక్కబడని ఈ వివాదం, తాజాగా దైవ సన్నిధిలో ప్రొటోకాల్ రచ్చకు దారితీసింది. ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం నెమలి వేణుగోపాలస్వామి ఆలయ బ్రహ్మోత్సవాల్లో ఎంపీ చేతిలో ఉన్న పట్టువస్త్రాలను ఎమ్మెల్యే కొలికపూడి బలవంతంగా లాక్కోవడం హాట్ టాపిక్ అయింది.  

నిన్న రాత్రి జరిగిన స్వామివారి కల్యాణానికి ఎంపీ చిన్ని, ఎమ్మెల్యే కొలికపూడి తమ సతీమణులతో హాజరయ్యారు. ఈ సందర్భంగా, స్వామివారికి సమర్పించే పట్టువస్త్రాలను ఆలయ పురోహితులు ఎంపీ చిన్ని దంపతులకు అందజేశారు. అయితే, తనకు కూడా వస్త్రాలు ఇవ్వాలని ఎమ్మెల్యే పట్టుబట్టారు. ప్రొటోకాల్ ప్రకారం ఒకరికే ఇస్తారని చెప్పిన ఆలయ అధికారులు, ఆయనకు తలంబ్రాలు అందించారు. దీంతో అసంతృప్తికి గురైన ఎమ్మెల్యే కొలికపూడి, ఎంపీ చేతిలోని పట్టువస్త్రాలను బలవంతంగా లాక్కుని తన తలపై పెట్టుకున్నారు. 

ఈ అనూహ్య పరిణామంతో అక్కడున్న భక్తులు నివ్వెరపోయారు. ఎంపీ వర్గీయులు అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుని, తోపులాటకు దారితీసింది. వెంటనే పోలీసులు జోక్యం చేసుకుని పరిస్థితిని చక్కదిద్దారు. ఎంపీ కేశినేని చిన్ని తన వర్గీయులను వారించి వివాదాన్ని సద్దుమణిగేలా చేశారు. అనంతరం కల్యాణ మండపంలో ముందు వరుసలో ఎమ్మెల్యే దంపతులు, వెనుక వరుసలో ఎంపీ దంపతులు కూర్చున్నారు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొనడంతో పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటుచేశారు.
Kesineni Srinivas
Kesineni Chinni
Kollikuppdi Srinivasarao
TDP
Vijayawada MP
Tiruvuru MLA
Andhra Pradesh Politics
Temple Ceremony
Protocol Dispute
Nemali Venugopalaswamy Temple

More Telugu News