'మేం తట్టి లేపితేనే రివ్యూలా?'.. రేవంత్ సర్కార్‌పై హరీశ్ రావు నిప్పులు

Harish Rao Fires at Revanth Reddy Government Over Project Delays
షార్ట్స్‌లో చూడండి

తెలంగాణ రాజకీయాల్లో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం మరోసారి తారాస్థాయికి చేరింది. ఈరోజు వరంగల్ పర్యటనకు వచ్చిన మాజీ మంత్రి, బీఆర్ఎస్ కీలక నేత హరీశ్ రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష్యంగా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ముఖ్యంగా వరంగల్‌లో నిర్మాణంలో ఉన్న 24 అంతస్తుల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి పనుల జాప్యంపై ఆయన నిప్పులు చెరిగారు. "మేము క్షేత్రస్థాయికి వచ్చి తట్టి లేపితేనే ముఖ్యమంత్రి నిద్ర లేస్తున్నారని... మేము ప్రాజెక్టులను విజిట్ చేసిన వెంటనే ఆయన రివ్యూలు నిర్వహిస్తున్నారు" అంటూ ఎద్దేవా చేశారు.


దేవాదుల ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును హరీశ్ రావు ఎండగట్టారు. తమ ప్రభుత్వ హయాంలోనే 90 శాతం పనులు పూర్తయ్యాయని, మిగిలిన 10 శాతం పనులను పూర్తి చేయడంలో ఈ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేళ్లు కావస్తున్నా, ఒక్క ఎకరా భూమిని కూడా సేకరించలేదని, కొత్తగా ఒక్క ఎకరాకు కూడా సాగునీరు అందించలేదని విమర్శించారు. దేవాదుల తమకు మొదటి ప్రాధాన్యత అని చెబుతున్న మాటలకు, క్షేత్రస్థాయిలో జరుగుతున్న పనులకు పొంతన లేదని, కేవలం డెడ్ లైన్లు మార్చుకుంటూ కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు.


పేదల ఆరోగ్యం కోసం కేసీఆర్ 'హెల్త్ సిటీ' నిర్మిస్తే, రేవంత్ రెడ్డి మాత్రం రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం 'ఫ్యూచర్ సిటీ' కలలు కంటున్నారని హరీశ్ రావు విమర్శించారు. కేసీఆర్‌కు పేరు వస్తుందనే అక్కసుతోనే వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి పనులను అటకెక్కించారని ఆరోపించారు. వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి పరిస్థితి దయనీయంగా మారిందని, ఏడాదిన్నరగా గుండె ఆపరేషన్లు ఆగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో తాము ఏర్పాటు చేసిన మూడు ఆక్సిజన్ ప్లాంట్లలో ప్రస్తుతం ఒక్కటి కూడా పనిచేయకపోవడం ఈ ప్రభుత్వ నేరపూరిత నిర్లక్ష్యానికి నిదర్శనమని ధ్వజమెత్తారు.


పాలనలో విఫలమైన ప్రభుత్వంపై ఇకనుంచి రాజీలేని పోరాటం చేస్తామని హరీశ్ రావు స్పష్టం చేశారు. "రెండేళ్లు ఓపిక పట్టాం.. ఇక గల్లా పట్టి అడుగుతాం" అంటూ ఘాటు హెచ్చరికలు జారీ చేశారు. అసెంబ్లీలో కెమెరాలు తిప్పకుండా, మైకులు కట్ చేయకుండా తమతో చర్చించే దమ్ము ముఖ్యమంత్రికి ఉందా అని సవాల్ విసిరారు. అభివృద్ధి పనుల్లో ఇదే నిర్లక్ష్యం కొనసాగితే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో భారీ నిరసన దీక్షలకు దిగుతామని ఆయన హెచ్చరించారు.

Go Back to Shorts
Harish Rao
Revanth Reddy
Telangana politics
BRS party
Warangal
Super Speciality Hospital
Devadula project
KCR Health City
MGM Hospital Warangal
Telangana government

More Telugu News