Telangana Weather: తెలంగాణకు అకాల వర్ష సూచన.. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్

Telangana Weather Forecast Yellow Alert Issued for Several Districts
  • నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం, ద్రోణి ప్రభావం
  • పలు జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్
  • పంట నష్టంపై అప్రమత్తంగా ఉండాలంటూ రైతులకు సూచన
  • హైదరాబాద్‌లో మేఘావృతం.. సాయంత్రం వేళ జల్లులు
తెలంగాణలో వాతావరణం ఒక్కసారిగా మారింది. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన బలమైన అల్పపీడనం, దానికి అనుబంధంగా ఉన్న ఉపరితల ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో రానున్న రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఈ మేరకు పలు జిల్లాలకు ‘ఎల్లో అలర్ట్’ జారీ చేసింది.

ప్రస్తుతం సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఏర్పడిన ద్రోణి.. మధ్య తమిళనాడు, కర్ణాటక మీదుగా మహారాష్ట్ర వరకు విస్తరించి ఉంది. దీని కారణంగా సోమ, మంగళవారాల్లో రాష్ట్రవ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని అధికారులు తెలిపారు. ముఖ్యంగా దక్షిణ, మధ్య తెలంగాణ జిల్లాల్లో వర్ష ప్రభావం అధికంగా ఉండనుంది.

ఒకవైపు రాష్ట్రంలో ఎండలు మండిపోతుండగా, మరోవైపు వర్ష సూచన రావడం గమనార్హం. మార్చి రాకముందే గరిష్ట ఉష్ణోగ్రతలు 35 డిగ్రీలు దాటుతున్నాయి. ఈ అకాల వర్షాల వల్ల చేతికొచ్చిన పంటలు దెబ్బతినే ప్రమాదం ఉందని, రైతులు అప్రమత్తంగా ఉండాలని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు. సోమవారం భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, వరంగల్, యాదాద్రి, రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్, నాగర్ కర్నూల్ సహా పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని, మంగళవారం కూడా వీటి ప్రభావం కొనసాగుతుందని వాతావరణ శాఖ పేర్కొంది.

ఇక హైదరాబాద్ నగరంలో ఆకాశం మేఘావృతమై ఉంటుందని, సాయంత్రం లేదా రాత్రి వేళల్లో తేలికపాటి జల్లులు పడొచ్చని తాజా బులెటిన్‌లో వివరించింది.
Telangana Weather
Hyderabad Weather
Rain Alert
Yellow Alert
IMD Hyderabad
Telangana Rains
Weather Forecast
Heavy Rains
Telangana districts

More Telugu News