Nara Lokesh: లోకేశ్ ఇంట డిన్నర్... ఒంగోలు, బాపట్ల నేతల్లో ఫుల్ జోష్... ఫొటోలు ఇవిగో!

Nara Lokesh Hosts Dinner Party for Ongole Bapatla Leaders
  • ఒంగోలు, బాపట్ల ప్రజాప్రతినిధులకు మంత్రి లోకేశ్ ఆత్మీయ విందు
  • రాజకీయాలకు తావులేకుండా కుటుంబ సభ్యులతో సరదాగా గడిపిన నేతలు
  • హాజరైన మహిళలకు 'మా ఇంటి గౌరవం' అంటూ మంగళగిరి పట్టుచీరల బహూకరణ
  • నేతలు ఇచ్చిన గ్రీవెన్స్ స్టేటస్ రిపోర్టులను అందించిన లోకేశ్
  • ఉండవల్లి నివాసంలో పండుగ వాతావరణంలో సాగిన కార్యక్రమం
నిత్యం రాజకీయాలు, ప్రభుత్వ కార్యక్రమాలు, నియోజకవర్గ సమస్యలతో సతమతమయ్యే ప్రజాప్రతినిధులలో సరికొత్త ఉత్సాహం నింపేందుకు ఐటీ, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేశ్ 'ఆత్మీయ కలయిక-ఇల్లే వేదిక' పేరిట విందు సమావేశాలు ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇవాళ కూడా ఉండవల్లిలోని నివాసంలో ఆత్మీయ విందు ఏర్పాటు చేశారు. గురువారం రాత్రి ఒంగోలు, బాపట్ల పార్లమెంటు సెగ్మెంట్ల పరిధిలోని కూటమి ఎంపీలు, ఎమ్మెల్యేల కోసం ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ విందుకు ప్రజాప్రతినిధులు తమ కుటుంబ సభ్యులతో కలిసి హాజరుకాగా, లోకేశ్ వారిని సాదరంగా ఆహ్వానించారు. సుమారు మూడు గంటల పాటు సాగిన ఈ విందు సమావేశం ఒక పండుగ వాతావరణాన్ని తలపించింది.

ఈ కార్యక్రమంలో రాజకీయాలకు, అసెంబ్లీ చర్చలకు ఎలాంటి తావులేకుండా కేవలం సరదా సంభాషణలు, నవ్వులతో సందడి నెలకొంది. నేతలు ఒకరినొకరు ఆటపట్టించుకుంటూ ఫుల్ జోష్‌తో గడిపారు. సాధారణంగా ప్రజాప్రతినిధుల మధ్య సత్సంబంధాలు ఉన్నప్పటికీ, వారి కుటుంబ సభ్యుల మధ్య పరిచయాలు పెంచాలన్నదే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశం. ఈ ఆత్మీయ కలయికతో మహిళలు, పిల్లలు సైతం ఒకరితో ఒకరు కలిసిపోయి ఉల్లాసంగా గడిపారు. ఈ సందర్భంగా, ప్రజాప్రతినిధులు తమ నియోజకవర్గాల సమస్యలు, అభివృద్ధి పనులపై గతంలో ఇచ్చిన వినతుల స్టేటస్ రిపోర్టులను లోకేశ్ వారికి అందజేశారు.

విందు అనంతరం, లోకేశ్ తన ప్రత్యేకతను చాటుకున్నారు. హాజరైన మహిళలకు 'మా ఇంటి గౌరవం' అంటూ మంగళగిరి పట్టుచీరలను ప్రేమగా బహూకరించారు. ఈ విందు సమావేశానికి ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, బాపట్ల ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్‌తో పాటు మంత్రులు బాలవీరాంజనేయస్వామి (కొండపి), అనగాని సత్యప్రసాద్ (రేపల్లె), గొట్టిపాటి రవికుమార్ (అద్దంకి), ఎమ్మెల్యేలు దామచర్ల జనార్దన్ (ఒంగోలు), కందుల నారాయణరెడ్డి (మార్కాపురం), ఎం.అశోక్ రెడ్డి (గిద్దలూరు), ముక్కు ఉగ్రనరసింహారెడ్డి (కనిగిరి), ఇంటూరి నాగేశ్వరరావు (కందుకూరు), నక్కా ఆనంద్ బాబు (వేమూరు), ఏలూరి సాంబశివరావు (పర్చూరు), ఎం.ఎం.కొండయ్య యాదవ్ (చీరాల), వేగేశ్న నరేంద్రవర్మరాజు (బాపట్ల), బీఎన్ విజయ్ కుమార్ (సంతనూతలపాడు) తమ కుటుంబాలతో సహా హాజరయ్యారు.
 
Nara Lokesh
Lokesh dinner party
Ongole
Bapatla
TDP
Andhra Pradesh Politics
Magunta Srinivasulu Reddy
Tennati Krishna Prasad
Mangalagiri sarees
MLA meeting

More Telugu News