: దానం నాగేందర్ పై అనర్హత వేటు పడటం ఖాయం: పాడి కౌశిక్ రెడ్డి
- పార్టీ ఫిరాయించిన దానంపై వేటు పడటం ఖాయమన్న కౌశిక్ రెడ్డి
- అన్ని ఆధారాలను స్పీకర్ కు అందించామని వెల్లడి
- ఖైరతాబాద్ కు ఉపఎన్నిక వస్తుందని వ్యాఖ్య
బీఆర్ఎస్ తరపున గెలుపొంది పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యే దానం నాగేందర్ పై అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కచ్చితంగా అనర్హత వేటు వేస్తారనే నమ్మకం తమకు ఉందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. దానం నాగేందర్ పార్టీ మారారని నిరూపించే అన్ని ఆధారాలను స్పీకర్ కు తాము అందజేశామని తెలిపారు. దానంపై వేటు వేసేందుకు ఇంతకంటే ఏమీ అవసరం లేదని చెప్పారు.
2024 మార్చి 15న దీపాదాస్ మున్షీ, రేవంత్ రెడ్డి సమక్షంలో దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారని ఆ పార్టీలో చేరారని తెలిపారు. 2024 మార్చి 21న కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన ఎంపీ అభ్యర్థుల జాబితాలో సికింద్రాబాద్ అభ్యర్థిగా దానం నాగేందర్ పేరును ప్రకటించారని అన్నారు. కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన దానం 4.29 లక్షల ఓట్లు పొందారని చెప్పారు. ఈ ఆధారాలన్నీ స్పీకర్ కు అందించామని తెలిపారు.