Pratyusha: సుప్రీంకోర్టు తీర్పుపై స్పందించిన సినీ నటి ప్రత్యూష తల్లి

Pratyushas mother reacts to Supreme Court verdict
  • తీర్పును స్వాగతిస్తున్నామని, కానీ పూర్తిస్థాయిలో న్యాయం జరగలేదని వ్యాఖ్య
  • కూతురు మృతి చెందిన సమయంలో బెదిరింపులు వచ్చాయన్న ప్రత్యూష తల్లి
  • ఉన్నతస్థానానికి చేరుకోవాల్సిన తన కూతురు జీవితాన్ని నాశనం చేశారని ఆగ్రహం
తన కూతురు మృతి కేసులో సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని, కానీ తమకు పూర్తిస్థాయిలో న్యాయం జరగలేదని సినీ నటి ప్రత్యూష తల్లి సరోజినీదేవి అన్నారు. ప్రత్యూష మృతి కేసులో సిద్ధార్థరెడ్డిని లొంగిపోవాలని సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. సుప్రీంకోర్టు తీర్పుపై ఆమె స్పందిస్తూ, అతనికి సరైన శిక్ష పడలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

తన కూతురు మృతి చెందిన సమయంలో తమకు బెదిరింపులు వచ్చాయని, కానీ ధైర్యంగా న్యాయస్థానంలో పోరాడామని అన్నారు. తన కూతురు ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని, ఆమెను చంపేశారని ఆరోపించారు. న్యాయం కోసం మొదటి నుంచి పోరాటం చేస్తున్నానని అన్నారు. ఉన్నతస్థానానికి చేరుకోవాల్సిన తన కూతురు జీవితాన్ని నాశనం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. నిందితుడు సిద్ధార్థరెడ్డి విదేశాల్లో ఉన్నాడని తెలిసిందని అన్నారు.

ఈ కేసును మొదట్లోనే అంతా తారుమారు చేశారని ఆరోపించారు. పోస్టుమార్టం నివేదికను కూడా ఆమె తప్పుబట్టారు. కానీ కొన్ని సాక్ష్యాలను సేకరించి పోరాటం ప్రారంభించానని అన్నారు. అప్పుడే సాక్ష్యాలు అన్నీ ఉండి ఉంటే నిందితులకు జీవితకాల శిక్ష తప్పకుండా పడేదని అన్నారు. కన్నతల్లిగా తాను ఇచ్చిన స్టేట్‌మెంట్‌ను పక్కన పెట్టారని ఆరోపించారు. 24 ఏళ్లుగా ఒంటరిగా పోరాడుతూ నరకం అనుభవిస్తున్నానని, తమకూ ఎవరూ తోడుగా రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
Pratyusha
Pratyusha suicide case
Siddhartha Reddy
actress Pratyusha death
Sarojini Devi
Supreme Court verdict

More Telugu News