BRS Party: ఇంద్రేశం బీఆర్ఎస్ కైవసం, జనగామలో లక్కీ డ్రాలో కాంగ్రెస్‌ను వరించిన అదృష్టం

BRS Party Wins Indresham Congress Lucky in Jangaon Municipal Elections
షార్ట్స్‌లో చూడండి
తెలంగాణలో వాయిదాపడిన పలు మున్సిపాలిటీల్లో ఈరోజు ఛైర్‌పర్సన్ ఎన్నిక ప్రక్రియ ప్రారంభమైంది. సంగారెడ్డి జిల్లా ఇంద్రేశం మున్సిపాలిటీని బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. స్వతంత్ర అభ్యర్థి మద్దతుతో బీఆర్ఎస్ ఈ మున్సిపాలిటీని దక్కించుకుంది. ఈ మున్సిపాలిటీలో 18 వార్డులకు గాను బీఆర్ఎస్ 9, కాంగ్రెస్ 4 బీజేపీ 2, స్వతంత్రులు 1 స్థానాలు గెలుచుకున్నారు. స్వతంత్ర అభ్యర్థి బీఆర్ఎస్ పార్టీకి మద్దతు పలికారు.

దీంతో ఇంద్రేశం మున్సిపల్ ఛైర్‌పర్సన్‌గా ప్రమీల, వైస్ ఛైర్మన్‌గా హరీశ్ రెడ్డి ఎన్నికయ్యారు. కాగా, పఠాన్‌చెరు పరిధిలోని ఐదు మున్సిపాలిటీలను బీఆర్ఎస్ దక్కించుకుంది. గడ్డపోతారం, గుమ్మడిదల, జిన్నారం, ఇస్నాపూర్, ఇంద్రేశంను బీఆర్ఎస్ గెలుచుకుంది.

జనగామ మున్సిపాలిటీలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు 16 చొప్పున ఓట్లు రావడంతో డ్రా వేశారు. అదృష్టం కాంగ్రెస్ పార్టీని వరించింది. రసాభాస మధ్య లక్కీ డ్రా తీయగా ఛైర్‌పర్సన్‌గా కాంగ్రెస్ అభ్యర్థి బాలమణిని అదృష్టం వరించింది. జనగామలో 30 వార్డులకు గాను బీఆర్ఎస్ 13, కాంగ్రెస్ 12, ఇతరులు 5 స్థానాలు గెలుచుకున్నారు. ఎక్స్అఫీషియోతో కలుపుకుంటే మేజిక్ ఫిగర్ 17 ఉండగా, రెండు పార్టీలకు 16 మంది సభ్యుల చొప్పున మద్దతు లభించింది.

ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీని బీఆర్ఎస్ దక్కించుకుంది. మున్సిపల్ ఛైర్మన్‌గా టేకు సుదర్శన్ రెడ్డి ఎన్నికయ్యారు. ఇల్లెందు మున్సిపాలిటీని కాంగ్రెస్ దక్కించుకోగా, దొడ్డ కిరణ్ మిత్ర ఛైర్మన్‌గా ఎన్నికయ్యారు. తొర్రూరు మున్సిపాలిటీని కూడా కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ఇక్కడ 16 వార్డులకు గాను బీఆర్ఎస్ 9, కాంగ్రెస్ 7 గెలుచుకుంది. అయితే ఓటింగ్‌లో రెండు పార్టీలకు సమాన ఓట్లు రావడంతో లక్కీ డ్రాలో కాంగ్రెస్‌ను అదృష్టం వరించింది.

నిన్న కోరం లేకపోవడంతో 11 మున్సిపాలిటీల్లో ఛైర్‌పర్సన్ ఎన్నిక వాయిదా పడింది. జనగాం, తొర్రూరు, ఇల్లందు, సుల్తానాబాద్, ఇబ్రహీంపట్నం, కాగజ్ నగర్, క్యాతనపల్లి, ఖానాపూర్, జహీరాబాద్, ఇంద్రేశం, డోర్నకల్ మున్సిపాలిటీలలో ఎన్నిక వాయిదా పడినట్లు అధికారులు ప్రకటించారు. దీంతో ఈరోజు పలు మున్సిపాలిటీల్లో ఎన్నిక ప్రక్రియ ప్రారంభమైంది.
Go Back to Shorts
BRS Party
Telangana Municipal Elections
Congress Party
Indresham Municipality
Jangaon Municipality

More Telugu News