Advertisement

మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక: ఆదిలాబాద్‌లో బీజేపీకి, బైంసాలో మజ్లిస్ పార్టీకి షాక్

Adilabad Municipal Election BJP Shock in Bainsa Majlis Party
  • ఆదిలాబాద్‌లో 49కి గాను 21 వార్డుల్లో గెలిచినప్పటికీ ఛైర్‌పర్సన్‌గా స్వతంత్ర అభ్యర్థి
  • కాంగ్రెస్, బీఆర్ఎస్, స్వతంత్రుల మద్దతుతో బండారి అనూష గెలుపు
  • భైంసాలో స్వతంత్రులకు మద్దతిచ్చిన బీజేపీ
తెలంగాణలో కార్పొరేషన్ మేయర్, మున్సిపల్ ఛైర్‌పర్సన్‌ల ఎన్నిక కొనసాగుతోంది. అయితే ఆదిలాబాద్‌లో బీజేపీ, భైంసాలో మజ్లిస్ పార్టీలకు షాక్ తగిలింది. ఈ మున్సిపాలిటీల్లో ఆయా పార్టీలు అత్యధిక స్థానాలను కైవసం చేసుకున్నప్పటికీ ఈరోజు జరిగిన ఎన్నికల్లో మున్సిపాలిటీలను దక్కించుకోలేకపోయాయి.

ఆదిలాబాద్‌ మున్సిపాలిటీలో 49 వార్డులకు గాను బీజేపీ 21, కాంగ్రెస్ 11, బీఆర్ఎస్ 6, ఇతరులు 11 స్థానాల్లో గెలిచారు. 25 మంది సభ్యుల మద్దతు ఉంటే మున్సిపాలిటీని దక్కించుకోవచ్చు. స్వతంత్ర అభ్యర్థులతో కలిసి బీజేపీ ఈ స్థానాన్ని దక్కించుకుంటుందని భావించినప్పటికీ, కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి బండారి అనూష ఛైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు.

ఎక్స్‌అఫీషియోతో కలిపి 51 ఓట్లు ఉన్నాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్, స్వతంత్రుల మద్దతుతో కలిపి ఆమె పదవిని దక్కించుకున్నారు. బండారి అనూషకు 27 ఓట్లు వచ్చాయి. ఎన్నికల్లో ఆమె కాంగ్రెస్ టిక్కెట్ ఆశించారు. టిక్కెట్ రాకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. ఇప్పుడు పలు పార్టీల మద్దతుతో ఛైర్‌పర్సన్ అయ్యారు. వైస్ ఛైర్మన్‌గా 44వ వార్డు మజ్లిస్ అభ్యర్థి మహమ్మద్ రోహిత్ ఎన్నికయ్యారు. బీజేపీ తరఫున ఛైర్‌పర్సన్‌ బరిలోకి దిగిన జోగు శైలజకు 23 ఓట్లు వచ్చాయి.

భైంసాలో 42 వార్డులకు మజ్లిస్ పార్టీ (12) అత్యధిక స్థానాల్లో గెలిచింది. దీంతో ఈ మున్సిపాలిటీని మజ్లిస్ దక్కించుకుంటుందని భావించారు. కానీ బీజేపీ సహకారంతో స్వతంత్రులు పీఠం ఎక్కారు. మజ్లిస్ పార్టీకి మున్సిపాలిటీ దక్కకుండా బీజేపీ చక్రం తిప్పింది. భైంసా మున్సిపల్ ఛైర్మన్‌గా స్వతంత్ర అభ్యార్థి తూము దత్తాత్రి, వైస్ ఛైర్మన్‌గా బీబీ ఖతీజా సిద్ధిఖీ ఎన్నికయ్యారు. కాగా, స్వతంత్రుల్లో అత్యధికులు బీజేపీ రెబల్ అభ్యర్థులు అని సమాచారం.
Advertisement
Adilabad Municipal Election
Telangana Municipal Elections
Bainsa Municipal Election
BJP
BRS

More Telugu News