Pawan Kalyan: తెలంగాణలో జనసేన గెలుపు... పార్టీ ప్రారంభ రోజులను గుర్తు చేసుకున్న పవన్ కల్యాణ్

Pawan Kalyan Recalls Janasena Partys Early Days After Telangana Victory
  • పార్టీ ఆవిర్భవించిన తెలంగాణ గడ్డపై తొలి అడుగు పడిందన్న పవన్ కల్యాణ్
  • తొలి నాళ్లను గుర్తు చేసుకుంటే భవిష్యత్తు ఏమిటనే ప్రశ్న ఉండేదని వ్యాఖ్య
  • చిన్న విత్తు నుంచే నేల పొరను చీల్చుకుంటే మొలక వేస్తుందన్న జనసేనాని
జనసేన పార్టీ ఆవిర్భవించిన తెలంగాణ గడ్డపై తొలి అడుగు పడిందని ఆ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. తెలంగాణలో ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ రెండు వార్డులను కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. నల్గొండ జిల్లా నేరేడుచర్ల మున్సిపాలిటీ 14 వార్డులో ఆరూరి విజయలక్ష్మి, మంచిర్యాల కార్పొరేషన్‌లో అగ్గు సాగర్ గెలుపొందారు. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ ఈ ఫలితాలపై స్పందించారు.

ప్రారంభంలో పార్టీ ఏ విధంగా ఉందో ఆయన గుర్తు చేసుకున్నారు. పార్టీ తొలినాళ్లను గుర్తు చేసుకుంటే దారంతా గతుకులు, భవిష్యత్తు ఏమిటనే ప్రశ్న ఉండేదని అన్నారు. చిన్నపాటి ఆసరా కూడా లేదని, అయినప్పటికీ ఏదో కొద్దిగా ఆశ ఉండేదని తెలిపారు. పార్టీ సిద్ధాంతాలను విశ్వసించిన వీరమహిళలు ఝాన్సీలక్ష్మీబాయి స్ఫూర్తిని నింపుకుని ఉద్యమ స్ఫూర్తితో జనసైనికులు ఎలాంటి ఒడిదుడుకులనైనా తట్టుకునేందుకు సన్నద్ధమయ్యారని అన్నారు.

తెలంగాణలో 332 చోట్ల పోటీ చేశామని, ఒక కౌన్సిలర్, ఒక కార్పొరేటర్ స్థానం తమకు దక్కాయని అన్నారు. మహా వృక్షమైనా చిన్న విత్తు నుంచే నేల పొరను చీల్చుకుంటూ మొలక వేస్తుందని అన్నారు. విశ్వవిజేత కూడా తల్లి కడుపులో అణువంతే ఉంటాడని అన్నారు. కోటి రతనాల తెలంగాణలో జనసేన విజయ ప్రయాణం లేలేత అడుగులతో మొదలైందని, ఇప్పుడు తాము సాధించిన విజయాలు భవిష్యత్తు ప్రస్థానానికి బలమైన స్ఫూర్తిని ఇస్తాయని అన్నారు.

పార్టీ ఉద్భవించిన నేలపై తమకు దక్కిన తొలి విజయం ఇది అని పవన్ కల్యాణ్ అన్నారు. పోరాట పటిమ, సంస్కృతి సంప్రదాయాల శక్తిని, సాహితీ సౌరభాన్ని అణువణువునా నింపుకున్న తెలంగాణ నేల తల్లికి హృదయ పూర్వక పాదాభివందనాలు అంటూ ప్రకటనలో పేర్కొన్నారు.
Pawan Kalyan
Janasena
Telangana
Municipal Elections
Nereducharla
Mancherial
Aroori Vijayalakshmi

More Telugu News