Andalib Rahman Partho: బంగ్లాదేశ్‌లో ఒక స్థానంలో గెలిచిన 'బీజేపీ'.. అసలు విషయం ఇదే!

Andalib Rahman Partho Wins Seat in Bangladesh Election
  • బీఎన్‌పీతో కలిసి పోటీ చేసిన బంగ్లాదేశ్ బీజేపీ (బంగ్లాదేశ్ జాతీయ పార్టీ)
  • భోలా-1 స్థానంలో గెలిచిన అందలీవ్ రెహ్మాన్ పార్థో
  • 30 వేలకు పైగా మెజారిటీతో గెలిచిన రెహ్మాన్
బంగ్లాదేశ్‌లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో 'బీజేపీ' ఒక స్థానంలో విజయం సాధించింది. అయితే ఈ 'బీజేపీకి' మన భారతీయ జనతా పార్టీకి ఎలాంటి సంబంధం లేదు. ఆ దేశంలో బంగ్లాదేశ్ జాతీయ పార్టీ (బీజేపీ) ఉంది. ఈ పార్టీ బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్‌పీ)కి మిత్రపక్షం కావడం గమనార్హం.

భోలా-1 స్థానం నుంచి పోటీ చేసిన బంగ్లాదేశ్ 'బీజేపీ'కి చెందిన అందలీవ్ రెహ్మాన్ పార్థో సమీప ప్రత్యర్థి జమాతే ఇ ఇస్లామీకి చెందిన నజ్రుల్ ఇస్లాంపై 30,226 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. రెహ్మాన్ పార్థో 1,05,543 ఓట్లను సాధించారు. 

297 స్థానాలకు ఎన్నికలు జరగగా బీఎన్‌పీ, దాని మిత్ర పక్షాలు 212 సీట్లు సాధించి అధికారాన్ని చేజిక్కించుకున్నాయి. బీఎన్‌పీ సొంతగా 209 సీట్లు సాధించింది. మిత్రపక్షాలు గనోసంహతి ఆందోళన్, బంగ్లాదేశ్ జాతీయ పార్టీ (బీజేపీ), గోనో ఓధికార్ పరిషత్ ఒక్కొక్క సీటు చొప్పున గెలుచుకున్నాయి. జమాత్, మిత్రపక్షాలు కలిపి 77 సీట్లకు పరిమితమయ్యాయి.

షేక్ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ పోటీలో లేకపోవడంతో ప్రధాన పోటీ బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ, జమాత్ ఏ ఇస్లామీ మధ్య నెలకొంది. ఎన్నికల్లో 50 పార్టీలు తమ అభ్యర్థులను బరిలో నిలిపాయి. 273 మంది స్వతంత్రులు సహా 2,208 అభ్యర్థులు బరిలో నిలచారు. బీఎన్‌పీ అత్యధికంగా 291 స్థానాల్లో అభ్యర్థులను బరిలో దింపింది.
Andalib Rahman Partho
Bangladesh Nationalist Party
BNP
Bangladesh Election
Bangladesh Politics

More Telugu News