Chhattisgarh road accident: ఛత్తీస్‌గఢ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం... నలుగురు కోబ్రా కమాండోల దుర్మరణం

Chhattisgarh Road Accident Kills Four COBRA Commandos
  • ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు కోబ్రా కమాండోల మృతి చెందారు
  • ధమ్తరి జిల్లాలో ఆగి ఉన్న ట్రక్కును ఢీకొట్టిన కమాండోల కారు 
  • ఈ ఘటనలో మరో కమాండోకు తీవ్ర గాయాలు, పరిస్థితి విషమం
  • ప్రమాదంపై ఛత్తీస్‌గఢ్ సీఎం, హోంమంత్రి తీవ్ర దిగ్భ్రాంతి 
  • అతివేగమే ప్రమాదానికి కారణమంటున్న పోలీసులు
ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 201వ కోబ్రా బెటాలియన్‌కు చెందిన నలుగురు కమాండోలు ప్రాణాలు కోల్పోయారు. మరో కమాండో ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ధమ్తరి జిల్లాలోని ఖప్రి బైపాస్‌పై శనివారం ఆగి ఉన్న ఒక ట్రక్కును కోబ్రా కమాండోలు ప్రయాణిస్తున్న కారు ఢీకొట్టడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. నక్సలిజంపై పోరాటంలో అంకితభావంతో పనిచేస్తున్న కమాండోలు మరణించడంపై రాష్ట్రవ్యాప్తంగా విషాద ఛాయలు అలుముకున్నాయి.

అర్జుని పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, కమాండోలు జగదల్‌పూర్ నుంచి కారులో తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన కారు ఆగి ఉన్న ట్రక్కును వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు కారు ముందు భాగం ట్రక్కు కిందకు దూసుకెళ్లి నుజ్జునుజ్జయింది. సమాచారం అందుకున్న పోలీసులు, సహాయక బృందాలు ఘటనాస్థలికి చేరుకుని, గ్యాస్ కట్టర్ల సహాయంతో కారులో చిక్కుకున్న వారిని బయటకు తీశాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు కమాండోలు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో ప్రాణాలు విడిచారు. తీవ్రంగా గాయపడిన మరో కమాండోను ధమ్తరి జిల్లా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

ఈ ఘటనపై ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి విష్ణు దేవ్ సాయి ‘ఎక్స్’ వేదికగా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. "కోబ్రా బెటాలియన్ వీర జవాన్లు అకాల మరణం చెందారన్న వార్త హృదయ విదారకంగా ఉంది. దేశ సేవలో అంకితమైన ఆ అమర జవాన్లకు నా వినమ్ర నివాళులు" అని పేర్కొన్నారు. రాష్ట్ర హోంమంత్రి విజయ్ శర్మ కూడా మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రాథమికంగా అతివేగమే ప్రమాదానికి కారణంగా పోలీసులు భావిస్తున్నప్పటికీ, అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఆపరేషన్ల కోసం సీఆర్‌పీఎఫ్ కింద పనిచేసే ప్రత్యేక దళమే కోబ్రా (కమాండో బెటాలియన్ ఫర్ రెజల్యూట్ యాక్షన్).
Chhattisgarh road accident
COBRA commandos
Naxalism
Vishnu Deo Sai
Dhamtari district
road accident
COBRA Battalion for Resolute Action
CRPF
Chhattisgarh
Khapri bypass

More Telugu News