Heritage Foods: 'సాక్షి' కథనంపై హెరిటేజ్ ఫుడ్స్ ఫైర్... ప్రకటన విడుదల

Heritage Foods Condemns Sakshi Article as False and Defamatory
షార్ట్స్‌లో చూడండి
తమ సంస్థ ప్రతిష్ఠను దెబ్బతీసే విధంగా 'సాక్షి' దినపత్రికలో ప్రచురితమైన కథనాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ పేర్కొంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఎడిషన్లలో నేడు (ఫిబ్రవరి 13న) "ముందు నెయ్యి.. వెనుక గొయ్యి.. హెరిటేజ్ కోసమే కుట్ర" అనే శీర్షికతో వచ్చిన వార్త పూర్తిగా అసత్యమని, దురుద్దేశపూరితమని, పరువు నష్టం కలిగించేలా ఉందని సంస్థ అధికారికంగా ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ ఆరోపణల వెనుక రాజకీయ కుట్ర ఉందని, ఇది కేవలం తమ 33 ఏళ్ల బ్రాండ్ విలువను దెబ్బతీయడమే లక్ష్యంగా సాగుతున్న దుష్ప్రచారమని హెరిటేజ్ ఫుడ్స్ పేర్కొంది.

ఇందాపూర్ డైరీతో సంబంధం లేదు
ఈ కథనంలో పేర్కొన్నట్టుగా మహారాష్ట్రకు చెందిన ఇందాపూర్ డైరీతో హెరిటేజ్ ఫుడ్స్‌కు ఎలాంటి యాజమాన్య లేదా సంస్థాగత సంబంధం లేదని స్పష్టం చేసింది. ఇందాపూర్ డైరీ అనేది ఒక స్వతంత్ర ప్రైవేట్ సంస్థ అని, దాని యాజమాన్యం, నిర్వహణ, కార్యకలాపాలు పూర్తిగా వేరని వివరించింది. తమకు ఇందాపూర్ డైరీతో కేవలం పనీర్, చీజ్, యూహెచ్‌టీ మిల్క్, స్కిమ్డ్ మిల్క్ పౌడర్ (SMP) తయారీకి మాత్రమే కాంట్రాక్ట్ మాన్యుఫాక్చరింగ్ ఒప్పందం ఉందని, నెయ్యి తయారీకి గానీ, సరఫరాకు గానీ ఎలాంటి ఒప్పందం లేదని తేల్చిచెప్పింది. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)కు నెయ్యి సరఫరా చేసేందుకు ఇందాపూర్ డైరీతో తాము ఎన్నడూ ఒప్పందం చేసుకోలేదని తెలిపింది.

రాజకీయ ప్రేరేపిత ఆరోపణలు
2014-2019 మధ్య కాలంలో టీటీడీకి నెయ్యి సరఫరా చేసినట్లు తమపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని హెరిటేజ్ ఫుడ్స్ ఆవేదన వ్యక్తం చేసింది. ఇందాపూర్ డైరీతో పాటు మరో ఐదు డైరీలను సిండికేట్‌గా చూపిస్తూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఇది పూర్తిగా అవాస్తవమని కొట్టిపారేసింది. ఈ నిరాధార ఆరోపణలను వైసీపీ నాయకులు, ముఖ్యంగా భూమన కరుణాకర్ రెడ్డి వంటి వారు, సాక్షి మీడియా ద్వారా ఉద్దేశపూర్వకంగా ప్రచారం చేస్తున్నారని హెరిటేజ్ ఆరోపించింది. ఇవి కేవలం రాజకీయ ప్రేరేపితమైనవని, కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీసే ప్రయత్నమని పేర్కొంది. గడచిన 33 సంవత్సరాలుగా రైతులు, వినియోగదారులకు నిజాయతీగా సేవలు అందిస్తున్న తమ సంస్థపై ఇలాంటి బురద జల్లడం దారుణమని తెలిపింది.

ప్రజలు ఇలాంటి తప్పుడు సమాచారాన్ని నమ్మవద్దని, వాస్తవాలను తెలుసుకునేందుకు తమ అధికారిక వెబ్‌సైట్ (heritagefoods.in)ను సందర్శించాలని హెరిటేజ్ ఫుడ్స్ విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు సంస్థ అధికారికంగా రిజాయిండర్ విడుదల చేసింది.
Go Back to Shorts
Heritage Foods
Sakshi
Heritage Foods fire
Bhuma Karunakar Reddy
Indapur Dairy
TTD
Tirumala Tirupati Devasthanam
Ghee supply
Andhra Pradesh politics
Political conspiracy

More Telugu News