Aryansh Sharma: టీ20 వరల్డ్ కప్: కెనడాపై యూఏఈ థ్రిల్లింగ్ విక్టరీ

టీ20 ప్రపంచకప్‌లో భాగంగా కెనడాపై యూఏఈ 5 వికెట్ల తేడాతో ఉత్కంఠ విజయం సాధించింది. న్యూఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో శుక్రవారం జరిగిన ఈ మ్యాచ్‌లో,  ఓటమి అంచున నిలిచిన యూఏఈ జట్టును ఆర్యన్ష్ శర్మ (74*), సోహైబ్ ఖాన్ (51) అద్భుతమైన ఇన్నింగ్స్‌లతో గెలిపించారు. 151 పరుగుల లక్ష్యాన్ని యూఏఈ మరో రెండు బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది.

151 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన యూఏఈ, కెనడా స్పిన్నర్ సాద్ బిన్ జాఫర్ (3/14) ధాటికి ఒక దశలో 66 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ దశలో క్రీజులోకి వచ్చిన సోహైబ్ ఖాన్ తన మెరుపు బ్యాటింగ్‌తో ఆట స్వరూపాన్నే మార్చేశాడు. కేవలం 29 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 51 పరుగులు చేసి కెనడా బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. మరో ఎండ్‌లో ఆర్యన్ష్ శర్మ 53 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 74 పరుగులు చేసి అజేయంగా నిలిచి జట్టుకు విజయాన్ని అందించాడు. వీరిద్దరూ ఐదో వికెట్‌కు కేవలం 42 బంతుల్లో 84 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి మ్యాచ్‌ను యూఏఈ వైపు తిప్పారు.

అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన కెనడా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 150 పరుగులు చేసింది. కెనడా బ్యాటర్లలో హర్ష్ థాకర్ (50), నవనీత్ ధలివాల్ (34) రాణించారు. యూఏఈ బౌలర్లలో జునైద్ సిద్ధిఖీ 5 వికెట్లతో సత్తా చాటాడు. అయితే, యువ ఆటగాళ్లు ఆర్యన్ష్, సోహైబ్ అద్భుత పోరాటంతో కెనడా ఆశలపై నీళ్లు చల్లి యూఏఈకి చిరస్మరణీయ విజయాన్ని అందించారు.
Aryansh Sharma
UAE
Canada
T20 World Cup
Sohaib Khan
Junaind Siddiqui
Harsh Thaker
Navneet Dhaliwal
UAE vs Canada

More Telugu News