Cambodia Cybercrime: మయన్మార్ తరహాలో కంబోడియాలోనూ సైబర్ మాఫియా సామ్రాజ్యం!

Cambodia Cybercrime Empire Similar to Myanmar Uncovered
  • భారీ సైబర్ నేర సామ్రాజ్యాన్ని రట్టు చేసిన థాయ్‌లాండ్ పోలీసులు 
  • ఓస్మాచ్ పట్టణంపై థాయ్ సైన్యం వ్యూహాత్మక దాడి 
  • ఉద్యోగాల పేరుతో మానవ అక్రమ రవాణా
సినిమా తెరపై కనిపించే భయానక సామ్రాజ్యాలను తలపించేలా కంబోడియా సరిహద్దుల్లో సాగుతున్న ఒక భారీ సైబర్ నేర సామ్రాజ్యాన్ని థాయ్‌లాండ్ పోలీసులు రట్టు చేశారు. కేజీఎఫ్ సినిమాలోని గనుల మాదిరిగా, వందల మంది యువతను బంధించి, ప్రైవేటు సైన్యంతో కాపలా పెట్టి, రోజుకు 18 గంటల పాటు బలవంతంగా పని చేయిస్తున్న తీరు అంతర్జాతీయంగా సంచలనం సృష్టిస్తోంది. ఓస్మాచ్ పట్టణంపై థాయ్ సైన్యం చేపట్టిన వ్యూహాత్మక దాడిలో ఆరు అంతస్తుల భారీ భవన సముదాయం బయటపడింది. బయటకు ఐటీ కంపెనీలా కనిపించే ఈ భవనం లోపల అసలు సిసలు సైబర్ మోసాల కర్మాగారం నడుస్తోందని అధికారులు గుర్తించారు. 

ఉద్యోగాల పేరుతో మానవ అక్రమ రవాణా ముఠాల ద్వారా వివిధ దేశాల యువతను అక్కడికి రప్పించి, వారి పాస్ పోర్టులను లాక్కుని బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెంచేశారు. వారిని నిర్బంధించి డిజిటల్ అరెస్టులు, బ్యాంకు మోసాలు, ఫేక్ పోలీసు కాల్స్ వంటి ఆన్లైన్ స్కామ్‌లు చేయించేవారు. ఈ బందీల్లో భారతీయులు, ముఖ్యంగా తెలుగు వారు కూడా ఉన్నట్లు సమాచారం. నిర్దేశించిన టార్గెట్ పూర్తి చేయకపోతే తీవ్రమైన హింసకు గురిచేసేవారని, కనీసం సూర్యుడిని చూసే అవకాశం కూడా లేని గదుల్లో వారిని బంధించేవారని బాధితులు వాపోతున్నారు. ఆ భవనంలో భారత్, చైనా, ఆస్ట్రేలియా వంటి దేశాల పోలీస్ స్టేషన్లను తలపించే సెట్లు, ఆయా దేశాల పోలీసు దుస్తులు, జాతీయ జెండాలను ఏర్పాటు చేసి మరీ ఈ మోసాలకు పాల్పడేవారు. 

ఈ గదుల్లో వందలాది కంప్యూటర్లు, హార్డ్ డిస్క్‌లు, వేల సంఖ్యలో సిమ్ కార్డులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అక్కడ పని చేస్తున్న వారు ఎదురుతిరిగితే శిక్షించేందుకు ప్రత్యేక రక్షణ సిబ్బందిని కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఇలాంటి సైబర్ నేరాల ద్వారా ఏటా సుమారు 12.5 బిలియన్ డాలర్లు కంబోడియాకు చేరుతున్నట్లు అంచనా వేస్తున్నారు. అయితే ఈ అంతర్జాతీయ ముఠాల ప్రభావం భారతీయ పల్లెలకు కూడా పాకి ప్రాణాలు తీస్తోంది. ములుగు జిల్లాకు చెందిన ఒక కూలీ, సైబర్ నేరగాళ్ల బెదిరింపులకు భయపడి ఆత్మహత్యకు పాల్పడటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. అపరిచిత వ్యక్తుల నుంచి వచ్చే వీడియో కాల్స్, పోలీసుల పేరుతో వచ్చే బెదిరింపుల పట్ల ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. 
Cambodia Cybercrime
Cyber Mafia
Human Trafficking
Online Scams
Osmech
Thailand Police
Digital Arrests
Fake Police Calls
India
Telugu

More Telugu News