ప్రేమ వివాహం విషాదాంతం.. తిరుపతి జిల్లాలో కంటతడి పెట్టిస్తున్న ఘటన

  • పుత్తూరులో ఇద్దరు పిల్లలకు ఉరివేసి తల్లి ఆత్మహత్య
  • భర్త నిరుద్యోగం, ఆర్థిక సమస్యలే కారణమని వెల్లడి
  • ఆత్మహత్యకు ముందు ఆవేదనతో సూసైడ్ నోట్ రాసిన మహిళ
  • తల్లిదండ్రులను ఎదిరించి ప్రేమ వివాహం చేసుకోవడమే తప్పయిందని ఆవేదన
తిరుపతి జిల్లా పుత్తూరులో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆర్థిక సమస్యలు, కుటుంబ కలహాలతో మనస్తాపం చెందిన ఓ తల్లి తన ఇద్దరు కన్నబిడ్డలకు ఉరివేసి, ఆపై తానూ ఆత్మహత్య చేసుకుంది. పుత్తూరులోని కృష్ణానగర్‌లో శనివారం జరిగిన ఈ హృదయ విదారక ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఆత్మహత్యకు ముందు ఆ తల్లి రాసిన సూసైడ్ నోట్, ఆమె పడిన మానసిక వేదనను కళ్లకు కడుతోంది.

పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం... పద్మ (28) అనే మహిళ తన కుమార్తెలు తేజ శ్రీ (6), లాస్య (5)లను చంపి, అనంతరం తానూ బలవన్మరణానికి పాల్పడింది. నిన్న‌ సాయంత్రం భర్త శివశంకర్ ఇంటికి వచ్చి చూడగా ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. పద్మ, శివశంకర్ డిగ్రీ చదివే రోజుల నుంచి ప్రేమించుకుని, 2019లో పెద్దలను ఎదిరించి వివాహం చేసుకున్నారు. అయితే, పెళ్లైన తర్వాత కూడా శివశంకర్ ఏ పనీ చేయకుండా బాధ్యతారహితంగా ఉండటంతో కుటుంబంలో ఆర్థిక కష్టాలు మొదలయ్యాయి.

పిల్లల స్కూల్ ఫీజులు, ఇంటి ఖర్చులు, డ్వాక్రా సంఘంలో తీసుకున్న అప్పు చెల్లించలేక పద్మ తీవ్రంగా మదనపడినట్లు తెలుస్తోంది. ఈ విషయమై శనివారం భర్తకు ఫోన్ చేయగా, డబ్బులు సర్దుబాటు కాలేదని చెప్పడంతో ఆమె తీవ్ర మనస్తాపానికి గురైంది. ఇదే క్రమంలో ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు.

కన్నీరు పెట్టిస్తున్న సూసైడ్ నోట్
ఘటనా స్థలంలో లభించిన సూసైడ్ నోట్‌లో పద్మ తన ఆవేదనను తెలియ‌జేసింది. "తల్లిదండ్రులను కాదని పెళ్లి చేసుకున్న ప్రతి అమ్మాయికి నా జీవితం ఓ గుణపాఠం. ఒక అమ్మాయి ఏ లక్షణాలైతే తన భర్తకు ఉండకూడదని అనుకుంటుందో... అలాంటి లక్షణాల‌న్నీ నా భర్తలో ఉన్నాయి. నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్న పాపానికి ఎన్నో కష్టాలు పడ్డాను. నా కడుపున పుట్టినందుకు ఈ పిల్లలూ ఆ కష్టాన్ని అనుభవిస్తున్నారు" అని లేఖలో పేర్కొంది. "నేను చనిపోతే ఇంకో పెళ్లి చేసుకుంటావ్. కనీసం ఈ సారైనా లైఫ్‌లో సెటిల్ అయ్యాక పెళ్లి చేసుకో" అని భర్తను ఉద్దేశించి రాయడం అందరినీ కలిచివేసింది.

స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పద్మ రాసిన సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకుని, భర్త శివశంకర్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.


More Telugu News