కొత్త హంగులతో వందే భారత్ స్లీపర్.. ప‌రుగుల‌కు రెడీ.. ఇదిగో వీడియో!

  • త్వరలో పట్టాలెక్కనున్న వందే భారత్ స్లీపర్ రైలు
  • కోల్‌కతా-గువాహ‌టి మార్గంలో ప‌రుగులు పెట్ట‌నున్న‌ తొలి ట్రైన్‌
  • మెరుగైన సౌకర్యాలు, కవచ్ భద్రతా వ్యవస్థతో రూపకల్పన
  • మధ్యతరగతిని దృష్టిలో ఉంచుకుని ఛార్జీల నిర్ణయం
  • న్యూఢిల్లీలో రైలు కోచ్‌లను పరిశీలించిన మంత్రి అశ్విని వైష్ణవ్
దేశంలో రైల్వే ప్రయాణ రూపురేఖలను మార్చేందుకు వస్తున్న కొత్త తరం వందే భారత్ స్లీపర్ రైలు త్వరలోనే ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది. ఈ రైలును రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ శనివారం న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌లో మీడియా ప్రతినిధులతో కలిసి పరిశీలించారు. అత్యంత ఆధునిక సౌకర్యాలతో ఈ రైలును తీర్చిదిద్దినట్లు ఆయన తెలిపారు. కోల్‌కతా-గువాహ‌టి మార్గంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ రైలు సేవలు ప్రారంభం కానున్నాయని వెల్లడించారు.

ప్రత్యేకతలివే!
ఈ రైలులోని ప్రత్యేకతలను మంత్రి వివరించారు. ప్రయాణికుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని విశాలమైన ట్రే హోల్డర్, సర్దుబాటు చేసుకునే విండో షేడ్స్, ప్రతి బెర్త్‌కు రీడింగ్ లైట్లు, హ్యాంగర్లు, మ్యాగజైన్ హోల్డర్లు ఏర్పాటు చేశారు. నీళ్లు బయటకు చిందకుండా ఉండేలా లోతైన వాష్ బేసిన్లను అమర్చారు. దృష్టి లోపం ఉన్న ప్రయాణికుల సౌకర్యార్థం సీటు నంబర్లను బ్రెయిలీ లిపిలో ముద్రించడం విశేషం.

వందే భారత్ స్లీపర్ రైలులో మొత్తం 16 కోచ్‌లు ఉంటాయి. వీటిలో 11 థర్డ్ ఏసీ, 4 సెకండ్ ఏసీ, ఒక ఫస్ట్ ఏసీ కోచ్ ఉన్నాయి. మొత్తం 823 బెర్తులు అందుబాటులో ఉంటాయి. సౌకర్యవంతమైన ప్రయాణం కోసం మెరుగైన కుషనింగ్‌తో బెర్తులను ఎర్గోనామిక్‌గా డిజైన్ చేశారు. ప్రయాణం సాఫీగా సాగేందుకు ఉన్నతమైన సస్పెన్షన్, శబ్దాన్ని తగ్గించే సాంకేతికతను వాడారు. ఆటోమేటిక్ డోర్లు, అత్యవసర పరిస్థితుల్లో మాట్లాడేందుకు ఎమర్జెన్సీ టాక్-బ్యాక్ సిస్టమ్, ప్రమాదాలను నివారించే ‘కవచ్’ ఆటోమేటిక్ ట్రైన్ ప్రొటెక్షన్ వ్యవస్థ వంటి భద్రతా ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

ఇటీవలే కమిషనర్ ఆఫ్ రైల్వే సేఫ్టీ పర్యవేక్షణలో ఈ రైలు తుది హై-స్పీడ్ ట్రయల్స్‌ను విజయవంతంగా పూర్తి చేసుకుంది. రైలు స్థిరత్వం, బ్రేకింగ్ పనితీరు, భద్రతా వ్యవస్థలు సహా అన్ని కీలక అంశాలను అధికారులు క్షుణ్ణంగా పరీక్షించారు.

ఛార్జీల వివరాలు ఇలా.. 
గతంలో మంత్రి ప్రకటించిన వివరాల ప్రకారం, వందే భారత్ స్లీపర్‌లో ఆహారంతో కలిపి థర్డ్ ఏసీ ఛార్జీ సుమారు రూ.2,300, సెకండ్ ఏసీ రూ.3,000, ఫస్ట్ ఏసీ రూ.3,600 వరకు ఉండే అవకాశం ఉంది. మధ్యతరగతి ప్రజలను దృష్టిలో ఉంచుకొనే ఈ ఛార్జీలను నిర్ణయించినట్లు మంత్రి తెలిపారు. ప్రారంభోత్సవం కోసం ఒక రైలును గౌహతికి, మరొకటి కోల్‌కతాకు తరలించనున్నట్లు అధికారులు పేర్కొన్నారు.


More Telugu News