Amazon Pay: కొత్త సేవలు ప్రారంభించిన అమెజాన్ పే

Amazon Pay launches new fixed deposit service
  • అమెజాన్ పేలో అందుబాటులోకి ఫిక్స్‌డ్ డిపాజిట్ సేవలు
  • 8 శాతం వరకు వార్షిక వడ్డీ పొందే అవకాశం
  • కనీస పెట్టుబడి రూ.1000 మాత్రమే, పూర్తి డిజిటల్ ప్రక్రియ
  • మహిళలు, సీనియర్ సిటిజన్లకు అదనపు వడ్డీ ప్రయోజనాలు
  • వివిధ బ్యాంకుల వడ్డీలను పోల్చుకునే సౌకర్యం
ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్‌కు చెందిన డిజిటల్ పేమెంట్స్ విభాగం అమెజాన్ పే, తన వినియోగదారుల కోసం ఓ కొత్త ఆర్థిక సేవను ప్రారంభించింది. ఇకపై అమెజాన్ పే యాప్ ద్వారానే ఫిక్స్‌డ్ డిపాజిట్లు (ఎఫ్‌డీ) చేసుకునే సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఈ ఎఫ్‌డీలపై వార్షికంగా 8 శాతం వరకు వడ్డీని అందిస్తున్నట్లు ప్రకటించింది.

ఈ సేవ కోసం శివాలిక్, సూర్యోదయ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు, శ్రీరామ్ ఫైనాన్స్ వంటి పలు బ్యాంకులు, ఆర్థిక సంస్థలతో అమెజాన్ పే భాగస్వామ్యం కుదుర్చుకుంది. వినియోగదారులు కేవలం రూ.1,000 కనీస పెట్టుబడితో ఎఫ్‌డీని ప్రారంభించవచ్చు. ఎలాంటి పత్రాలు సమర్పించాల్సిన అవసరం లేకుండా, పూర్తిగా డిజిటల్ పద్ధతిలో వివిధ బ్యాంకుల వడ్డీ రేట్లను పోల్చి చూసుకుని నచ్చినదాన్ని ఎంచుకోవచ్చు. దీనికోసం ప్రత్యేకంగా సేవింగ్స్ ఖాతా తెరవాల్సిన అవసరం లేదు.

శ్రీరామ్ ఫైనాన్స్‌లో మహిళా ఇన్వెస్టర్లకు 0.5 శాతం అదనపు వడ్డీ లభించనుండగా, సీనియర్ సిటిజన్లకు అన్ని భాగస్వామ్య సంస్థల నుంచి అదనపు వడ్డీ ప్రయోజనం ఉంటుంది. బ్యాంకుల్లో చేసే ఎఫ్‌డీలకు డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్ (DICGC) నుంచి రూ.5 లక్షల వరకు బీమా హామీ ఉంటుందని కంపెనీ స్పష్టం చేసింది.

భారత్‌లో ఫిక్స్‌డ్ ఇన్‌కమ్ సాధనాలకు మంచి ఆదరణ ఉందని, ఈ కొత్త సేవ ద్వారా వినియోగదారులకు మెరుగైన రాబడి, మరిన్ని ఎంపికలు అందిస్తున్నామని అమెజాన్ పే సీఈఓ వికాస్ బన్సాల్ తెలిపారు. యూపీఐ చెల్లింపులు, బిల్ పేమెంట్స్‌తో పాటు ఇప్పుడు పెట్టుబడి సేవలను కూడా జోడించి, అమెజాన్ పే తన ఆర్థిక సేవల పరిధిని మరింత విస్తరించుకుంటోంది.
Amazon Pay
fixed deposits
FD
digital payments
Shivalik Bank
Suryoday Small Finance Bank
Shriram Finance
Vikas Bansal
investment

More Telugu News