Yarlagadda Srinivasa Rao: రూ.50,000 లంచం తీసుకుంటూ.. ఏసీబీకి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డ తహసీల్దార్

Tahsildar Arrested in Kamareddy for Accepting Bribe
  • కామారెడ్డి జిల్లాలో లంచం తీసుకుంటూ పట్టుబడ్డ తహసీల్దార్
  • భూమి బదిలీ రిపోర్ట్ కోసం రూ.50 వేలు డిమాండ్
  • ప్రైవేట్ వ్యక్తి ద్వారా లంచం స్వీకరిస్తూ ఏసీబీకి చిక్కిన వైనం
  • తహసీల్దార్, మధ్యవర్తిని అరెస్ట్ చేసిన అధికారులు
  • లంచం అడిగితే 1064కి కాల్ చేయాలని ఏసీబీ సూచన
కామారెడ్డి జిల్లాలో ఓ తహసీల్దార్ లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. నాగిరెడ్డిపేట మండల తహసీల్దార్ యార్లగడ్డ శ్రీనివాసరావు, ఓ ప్రైవేట్ వ్యక్తితో కలిసి రూ.50,000 లంచం స్వీకరిస్తుండగా మంగళవారం ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు.

వివరాల్లోకి వెళితే.. ఒక వ్యక్తి తన తండ్రి పేరు మీద ఉన్న వ్యవసాయ భూమిని తన పేరు మీదకు మార్చుకోవడానికి దరఖాస్తు చేసుకున్నాడు. ఈ ప్రక్రియలో అనుకూలంగా నివేదిక పంపేందుకు తహసీల్దార్ శ్రీనివాసరావు రూ.50,000 లంచం డిమాండ్ చేశాడు. ఈ మొత్తాన్ని చిన్నూరి అజయ్ అనే ప్రైవేట్ వ్యక్తి ద్వారా తనకు అందజేయాలని సూచించాడు. దీంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు.

ఫిర్యాదు స్వీకరించిన ఏసీబీ అధికారులు పక్కా ప్రణాళికతో వల పన్నారు. బాధితుడు మంగళవారం తహసీల్దార్ కార్యాలయంలో అజయ్ ద్వారా డబ్బులు అందజేస్తుండగా అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. రసాయనం పూసిన నోట్లను స్వాధీనం చేసుకుని, వారి చేతులను పరీక్షించగా పాజిటివ్ రిజల్ట్ వచ్చింది. దీంతో తహసీల్దార్ శ్రీనివాసరావుతో పాటు మధ్యవర్తిగా వ్యవహరించిన అజయ్‌ను కూడా ఏసీబీ అరెస్ట్ చేసింది.

అనంతరం ఇద్దరినీ హైదరాబాద్‌లోని నాంపల్లి ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపరిచారు. అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

ప్రభుత్వ అధికారులు ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే తమ టోల్ ఫ్రీ నెంబర్ 1064కు లేదా వాట్సాప్ (9440446106), ఇతర సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా సమాచారం ఇవ్వాలని ఏసీబీ ప్రజలకు విజ్ఞప్తి చేసింది. ఫిర్యాదుదారుల వివరాలను గోప్యంగా ఉంచుతామని స్పష్టం చేసింది.
Yarlagadda Srinivasa Rao
Kamareddy
ACB
bribe
Nagi Reddy pet
Tahsildar
corruption
Telangana
Chinnoori Ajay

More Telugu News