Mustafizur Rahman: ముస్తాఫిజూర్ ఈ గొడవలేమీ పట్టించుకోవడంలేదు... కూల్ గా ఉన్నాడు: అష్రాఫుల్

Mustafizur Rahman Cool Amidst KKR Controversy Says Ashraful
  • కేకేఆర్ నుంచి ముస్తాఫిజూర్ తొలగింపు
  • రెండు దేశాల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో బీసీసీఐ నిర్ణయం
  • అతడేమీ ఆందోళన చెందడంలేదన్న మాజీ సారథి అష్రాఫుల్
  • భారత్‌లో ఆడబోమంటూ ఐసీసీకి బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు లేఖ
  • 2026 టీ20 వరల్డ్ కప్ మ్యాచ్‌లను తరలించాలని విజ్ఞప్తి
ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) ఫ్రాంచైజీ నుంచి తనను తప్పించడంపై బంగ్లాదేశ్ పేసర్ ముస్తాఫిజుర్ రహ్మాన్ ఏమాత్రం ఆందోళన చెందడం లేదని ఆ దేశ మాజీ కెప్టెన్, బ్యాటింగ్ కోచ్ మహ్మద్ అష్రాఫుల్ వెల్లడించాడు. మైదానం బయట జరుగుతున్న చర్చలను ముస్తాఫిజుర్ అస్సలు పట్టించుకోవడం లేదని, అతను చాలా కూల్‌గా ఉన్నాడని తెలిపాడు. ప్రస్తుతం బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ (బీపీఎల్)‌పైనే పూర్తి దృష్టి సారించాడని చెప్పాడు.

"మైదానం వెలుపల జరిగే చర్చల గురించి అతను అస్సలు పట్టించుకోవడం లేదు. బీసీబీ, ఇండియా, బీపీఎల్ లేదా ఐసీసీ... ఇలాంటి విషయాల గురించి అతను ఆందోళన చెందడు. ప్రస్తుతం అతను రంగపూర్ రైడర్స్ తరఫున ఆడటంపైనే ఫోకస్ పెట్టాడు. ఈ ఫార్మాట్‌లో అతను ఒక వరల్డ్ ఛాంపియన్" అని అష్రాఫుల్ వ్యాఖ్యానించాడు.

భారత్, బంగ్లాదేశ్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా, బీసీసీఐ ఆదేశాల మేరకు కేకేఆర్ యాజమాన్యం ముస్తాఫిజుర్‌ను జట్టు నుంచి విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయంపై బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) తీవ్రంగా స్పందించింది. ఆదివారం అత్యవసరంగా సమావేశమైన బోర్డు, 2026 టీ20 ప్రపంచకప్‌లో తమ మ్యాచ్‌లను భారత్ నుంచి వేరే వేదికలకు తరలించాలని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ)ని అధికారికంగా కోరింది. భద్రతా కారణాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. అటు, తమ దేశంలో ఐపీఎల్ ప్రసారాలను నిషేధిస్తున్నట్టు బంగ్లా సర్కారు ఓ ప్రకటనలో తెలిపింది.

కాగా, 2026 టీ20 ప్రపంచకప్‌నకు భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్నాయి. షెడ్యూల్ ప్రకారం బంగ్లాదేశ్ తమ మ్యాచ్‌లను కోల్‌కతా, ముంబై వేదికల్లో ఆడాల్సి ఉంది. ఇప్పుడు బీసీబీ తీసుకున్న ఈ నిర్ణయంతో టోర్నమెంట్ షెడ్యూల్‌కు అంతరాయం కలిగే ప్రమాదం ఏర్పడింది.
Mustafizur Rahman
Kolkata Knight Riders
BPL
Bangladesh Premier League
Mohammad Ashraful
BCB
ICC
T20 World Cup 2026

More Telugu News