Chandrababu Naidu: 2026లోనూ పెట్టుబడుల ఫ్లో ఏపీ వైపే ఉండాలి: సీఎం చంద్రబాబు

Chandrababu Focus on Investment Flow to AP in 2026
  • సీఎం అధ్యక్షతన పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు (ఎస్ఐపీబీ) సమావేశం
  • అధికారులకు చంద్రబాబు దిశానిర్దేశం
  • టీమ్ వర్క్ తోనే గతేడాది ఉత్తమ ఫలితాలు సాధించామని వెల్లడి
  • ఇకమీదట కూడా అదే జోరు కొనసాగించాలని సూచన
2025లో సాధించిన విజయాలను స్ఫూర్తిగా తీసుకుని, 2026లోనూ అదే ఉత్సాహంతో పనిచేసి ఆంధ్రప్రదేశ్‌ను పెట్టుబడులకు ప్రధాన గమ్యస్థానంగా నిలపాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. టీమ్ వర్క్‌తో పనిచేయడం వల్లే గతేడాది ఉత్తమ ఫలితాలు సాధించామని, ఇదే జోరును రానున్న కాలంలోనూ కొనసాగించాలని మంత్రులకు, అధికారులకు ఆయన దిశానిర్దేశం చేశారు. ఈ ఏడాది కూడా పెట్టుబడుల ప్రవాహం మన రాష్ట్రం వైపే ఉండాలని అన్నారు. మంగళవారం నాడు సచివాలయంలో ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన 14వ రాష్ట్ర స్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు (ఎస్ఐపీబీ) సమావేశంలో రూ.19,391 కోట్ల విలువైన పెట్టుబడులకు ఆమోదం తెలిపారు. ఈ పెట్టుబడుల ద్వారా రాష్ట్రంలో 11,753 మందికి కొత్తగా ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి.

సమావేశం ప్రారంభంలో మంత్రులు, అధికారులు ముఖ్యమంత్రికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, "2025లో అందరం కలిసికట్టుగా పనిచేయడం వల్లే రాష్ట్రానికి తిరిగి బ్రాండ్ ఇమేజ్ వచ్చింది. గత ప్రభుత్వ హయాంలో దెబ్బతిన్న ప్రతిష్టను పునరుద్ధరించి, గూగుల్, టాటా, జిందాల్, అదానీ, రిలయన్స్ వంటి దిగ్గజ సంస్థలను రాష్ట్రానికి తీసుకురాగలిగాం. ఈ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ, ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా అధికారులు బాధ్యతగా వ్యవహరించాలి," అని స్పష్టం చేశారు.

పర్యాటక రంగ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి

రాష్ట్రంలో పర్యాటక రంగ అభివృద్ధికి విస్తృత అవకాశాలు ఉన్నాయని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. "సూర్యలంక అత్యంత సురక్షితమైన బీచ్. దాని అభివృద్ధికి ఒక మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయాలి. 15 కిలోమీటర్ల మేర కాలుష్య రహిత బీచ్ ఫ్రంట్‌ను అభివృద్ధి చేసి, రిసార్ట్స్‌కు బ్రాండింగ్ కల్పించాలి. మాల్దీవుల తరహాలో సూళ్లూరుపేట సమీపంలోని చిన్న చిన్న ద్వీపాలను 'ఐల్యాండ్ టూరిజం'గా తీర్చిదిద్దాలి. పాపికొండలు-పోలవరం, కోనసీమ, పులికాట్, విశాఖ క్లస్టర్లను పర్యాటకంగా అభివృద్ధి చేయాలి. 2000 ఏళ్ల చరిత్ర ఉన్న తిమ్మమ్మ మర్రిమానుకు గూగుల్ మ్యాపింగ్ చేయించి ప్రపంచానికి పరిచయం చేయాలి. ఆవకాయ్, ఫ్లెమింగో, గండికోట వంటి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలి" అని అధికారులకు సూచించారు.

రైతులకు మేలు చేసే ఫుడ్ ప్రాసెసింగ్

ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో ఏపీ ఛాంపియన్‌గా నిలవాలని సీఎం ఆకాంక్షించారు. "తిరుపతి ప్రాంతానికి మరిన్ని ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు రావాలి. రైతులు పండించిన ఉద్యాన పంటలకు విలువ జోడింపు (వాల్యూ అడిషన్) జరిగితేనే వారికి గరిష్ట ప్రయోజనం దక్కుతుంది. భవిష్యత్తులో పెరగనున్న ఉద్యాన ఉత్పత్తులకు అనుగుణంగా ప్రాసెసింగ్ యూనిట్లను ప్రోత్సహించాలి," అని వివరించారు. ఈ సందర్భంగా పాలసీల అమలులో ఎలాంటి మినహాయింపులు ఉండకూడదని, అందరికీ సమాన అవకాశాలు కల్పించాలని స్పష్టం చేశారు. 

అనంతరం సీఎం చంద్రబాబు 'ఏపీ ఐటీ ఇన్ఫ్రా కనెక్ట్' పోర్టల్‌ను ఆవిష్కరించారు. ఈ సమావేశంలో మంత్రులు నారా లోకేశ్, పయ్యావుల కేశవ్, అచ్చెన్నాయుడు, నారాయణ, ఇతర మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Chandrababu Naidu
Andhra Pradesh
Investments
AP SIPB
Tourism Development
Food Processing
Job Creation
AP IT Infra Connect
Nara Lokesh
Payyavula Keshav

More Telugu News