Chandrababu Naidu: అమరావతికి పర్యాటక శోభ... కృష్ణా తీరంలో మెరీనా వాటర్ ఫ్రంట్

Chandrababu Naidu Focuses on Amaravati Marina Water Front Development
  • అమరావతిలో మెరీనా వాటర్ ఫ్రంట్ ఏర్పాటుకు సీఎం ఆమోదం
  • పీపీపీ పద్ధతిలో జెట్టీలు, ఫుడ్ ప్లాజాల నిర్మాణం
  • రాజధానిలో అనాథ మైనర్లకు రూ.5,000 పెన్షన్
  • ఆర్థిక పరిపుష్టిపై దృష్టి సారించాలని సీఆర్డీఏ, ఏడీసీఎల్‌కు సూచన
  • వీధిశూల ప్లాట్ల రైతులకు ప్రత్యామ్నాయ స్థలాల కేటాయింపు
నవ్యాంధ్ర రాజధాని అమరావతికి పర్యాటక రంగంలో సరికొత్త శోభను తీసుకువచ్చే దిశగా ప్రభుత్వం కీలక అడుగు వేసింది. కృష్ణా నదీ తీరాన్ని అంతర్జాతీయ స్థాయిలో 'మెరీనా వాటర్ ఫ్రంట్'గా అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. మంగళవారం నాడు ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన 57వ సీఆర్డీఏ అథారిటీ సమావేశంలో ఈ ప్రతిపాదనలకు ఆమోదముద్ర వేశారు. అమరావతిని ప్రపంచ పటంలో ఒక ప్రత్యేక పర్యాటక కేంద్రంగా నిలపాలన్న లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.

మెరీనా వాటర్ ఫ్రంట్‌లో భాగంగా జెట్టీలు, పర్యాటకుల కోసం లీజర్ బోట్లు, ఫుడ్ ప్లాజాలు, ఆహ్లాదాన్ని పంచే ల్యాండ్‌స్కేప్ పనులను ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ) పద్ధతిలో చేపట్టాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. దీనికి సంబంధించి వెంటనే టెండర్లు పిలవాలని ఆదేశించారు. వాటర్ ఫ్రంట్ రూపకల్పన కోసం ఒక సమగ్ర మాస్టర్ ప్లాన్‌ను సిద్ధం చేయాలని, రివర్ ఫ్రంట్‌తో పాటు వాటర్ స్పోర్ట్స్ యాక్టివిటీస్‌కు కూడా ఇందులో చోటు కల్పించాలని స్పష్టం చేశారు. 'బ్లూ-గ్రీన్ సిటీ'గా అమరావతిని తీర్చిదిద్దే ప్రణాళికలో భాగంగా అంతర్గత కాలువల నిర్మాణం, సుందరీకరణ పనులు వేగవంతం చేయాలన్నారు.

ప్రకాశం బ్యారేజీకి ఎగువన నిర్మించనున్న నూతన బ్యారేజీతో రాజధానికి నీటి వనరులు సమృద్ధిగా అందుబాటులోకి వస్తాయని చంద్రబాబు వివరించారు. దీనివల్ల కృష్ణా నదికి ఇరువైపులా అద్భుతమైన వాటర్ ఫ్రంట్‌ను అభివృద్ధి చేసుకునేందుకు వీలు కలుగుతుందని తెలిపారు. నదిలో ఉన్న ఐల్యాండ్స్‌ను కూడా పర్యాటకపరంగా ఎలా అభివృద్ధి చేయవచ్చో పరిశీలించాలని అధికారులకు సూచించారు.

ఈ సమావేశంలో మరికొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాజధాని కోసం భూములిచ్చిన భూమిలేని నిరుపేదలకు ఇస్తున్న పెన్షన్‌ను, తల్లిదండ్రులను కోల్పోయిన మైనర్ అనాథలకు కూడా వర్తింపజేయాలని నిర్ణయించారు. దీని ప్రకారం అర్హులైన మైనర్లకు నెలకు రూ.5,000 చొప్పున పెన్షన్ అందనుంది.

అదేవిధంగా, రైతులకు కేటాయించిన ప్లాట్లలో వాస్తురీత్యా అనుకూలంగా లేని 112 'వీధిశూల' ప్లాట్లకు బదులుగా మరోచోట ప్రత్యామ్నాయ ప్లాట్లను కేటాయించేందుకు అంగీకారం తెలిపారు. అయితే, మ్యుటేషన్ పూర్తికాని, థర్డ్ పార్టీకి విక్రయించని ప్లాట్లకు మాత్రమే ఈ అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు. రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని సీఎం నొక్కిచెప్పారు.

అమరావతి డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఏడీసీఎల్), సీఆర్డీఏ సంస్థలు ఆర్థికంగా మరింత బలోపేతం కావాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. ఇందుకోసం ప్రత్యేక రెవెన్యూ మోడల్స్‌ను అధ్యయనం చేయాలని, ఆస్తులను సమకూర్చుకుని సుస్థిర ఆదాయం పొందేలా రెండు సంస్థలు ఎదగాలని దిశానిర్దేశం చేశారు. 

అమరావతిలో తలపెట్టిన స్పోర్ట్స్ సిటీ వంటి ప్రాజెక్టుల కోసం ఖతార్ మోడల్‌ను అధ్యయనం చేయాలని సూచించారు. రాజధాని నిర్మాణ పనులన్నీ నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో మంత్రి నారాయణ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్, పురపాలక, సీఆర్డీఏ, ఆర్థిక శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Chandrababu Naidu
Amaravati
Marina Water Front
Krishna River
Tourism
Andhra Pradesh
CRDA
PPP model
Water Sports
Capital City

More Telugu News