కొత్తగా మార్కాపురం, పోలవరం జిల్లాలు... తుది నోటిఫికేషన్ విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం
- ఏపీలో మార్కాపురం, పోలవరం కేంద్రాలుగా రెండు కొత్త జిల్లాల ఏర్పాటు
- రేపటి నుంచి అమల్లోకి రానున్న కొత్త జిల్లాలు మరియు రెవెన్యూ డివిజన్లు
- శ్రీకాకుళం, కాకినాడ సహా పలు జిల్లాల్లో సరిహద్దుల మార్పులు
ప్రభుత్వం జారీ చేసిన తాజా నోటిఫికేషన్ ప్రకారం.. రంపచోడవరం కేంద్రంగా పోలవరం జిల్లా, మార్కాపురం కేంద్రంగా మార్కాపురం జిల్లా కార్యకలాపాలు సాగించనున్నాయి. రేపటి (డిసెంబర్ 31) నుంచి ఈ కొత్త జిల్లాలు, డివిజన్లు అధికారికంగా అమల్లోకి రానున్నాయి. కేవలం కొత్త జిల్లాలే కాకుండా, పలు నియోజకవర్గాలు మరియు మండలాల పరిధిలోనూ మార్పులు జరిగాయి. శ్రీకాకుళం జిల్లాలో నందిగామ మండలాన్ని పలాస డివిజన్ నుంచి టెక్కలికి, కాకినాడ జిల్లాలో సామర్లకోట మండలాన్ని పెద్దాపురం డివిజన్‌కు మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు. అలాగే పెనుగొండ పేరును ‘వాసవీ పెనుగొండ’గా మార్చారు. అనకాపల్లి జిల్లాలో అడ్డరోడ్డు జంక్షన్ కేంద్రంగా కొత్త రెవెన్యూ డివిజన్ ఏర్పాటైంది.
రేపటి నుంచి కొత్త జిల్లాలు అమల్లోకి వస్తుండటంతో, అధికారిక బోర్డులు, రికార్డులు మరియు సరిహద్దు రాళ్లలో మార్పులు చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. కొత్త ఏడాది కానుకగా వస్తున్న ఈ మార్పులతో పాలన ప్రజలకు మరింత చేరువవుతుందని ప్రభుత్వం భావిస్తోంది. జిల్లాల పునర్విభజన నేపథ్యంలో ప్రజలు తమ ప్రాంత పరిధిని సరిచూసుకుని, దానికి అనుగుణంగా ప్రభుత్వ కార్యాలయాలను సంప్రదించాల్సి ఉంటుంది.