ఏపీలో నాణ్యమైన మద్యం అమ్మకాలు జరగాలి: సీఎం చంద్రబాబు
Add ap7am to your home Screen

ఏపీలో నాణ్యమైన మద్యం అమ్మకాలు జరగాలి: సీఎం చంద్రబాబు

Chandrababu Naidu Focuses on Quality Liquor Sales in AP
  • మద్యం విధానంలో పారదర్శకతే ప్రధానమన్న సీఎం చంద్రబాబు
  • జాతీయ, అంతర్జాతీయ బ్రాండ్లు, నాణ్యత ఉన్న మద్యం విక్రయాలు మాత్రమే జరగాలన్న సీఎం
  • పర్మిట్ రూమ్‌లను అనుమతించే అంశంపై కమిటీ అధ్యయనం చేసి నిర్ణయం తీసుకోవాలన్న సీఎం చంద్రబాబు
మద్యం విధానంలో పారదర్శకతే ప్రధానమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు స్పష్టం చేశారు. ఈ విషయంలో ఎలాంటి రాజీ ఉండదని ఆయన తేల్చి చెప్పారు. రాష్ట్ర సచివాలయంలో అబ్కారీ శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు నిన్న సమీక్ష నిర్వహించారు. అనుమానాస్పదంగా ఉన్న బ్రాండ్ల విక్రయాలన్నీ నిలిపివేయాలని ఆయన ఆదేశించారు. జాతీయ, అంతర్జాతీయ బ్రాండ్లు, నాణ్యత కలిగిన మద్యం విక్రయాలు మాత్రమే జరగాలని ఆయన అధికారులకు స్పష్టం చేశారు. ప్రజల ఆరోగ్యం కంటే ఏదీ ముఖ్యమైనది కాదని ఆయన అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్, నాటు సారా విక్రయాలు జరగడానికి వీల్లేదని స్పష్టం చేశారు. ప్రజారోగ్యంపై ప్రభావం పడకుండా నాణ్యమైన మద్యాన్ని మాత్రమే విక్రయించేలా చూడాలని ఆదేశించారు. గత ప్రభుత్వ హయాంలో పెద్ద ఎత్తున నకిలీ బ్రాండ్లు విక్రయాలు జరిగాయని, తద్వారా ప్రజల ఆరోగ్యం పాడైందని అన్నారు.

**నకిలీ బ్రాండ్లతో ప్రజారోగ్యంపై ప్రభావం**


నకిలీ మద్యం బ్రాండ్ల కారణంగా ట్రేడ్ డైవర్ట్ అయ్యిందని, తద్వారా రాష్ట్రం ఆదాయం కోల్పోయిందని అన్నారు. అదే సమయంలో ప్రజల ఆరోగ్యం కూడా దెబ్బతిందని సీఎం అన్నారు. 2014 నుంచి 19 మధ్య అమలైన మద్యం పాలసీ ఎలా ఉంది, గత ప్రభుత్వ హయాంలో అమలు చేసిన విధానంపై అధ్యయనం చేసి నివేదికను ప్రజల ముందు ఉంచాలని సీఎం స్పష్టం చేశారు. కూటమి అధికారంలోకి వచ్చాక అమలు చేసిన నూతన మద్యం పాలసీతో ఏపీ రెవెన్యూ పెరిగిందని స్పష్టం చేశారు. గతంలో పొరుగు రాష్ట్రాలకు తరలిపోయిన ఆదాయం ఇప్పుడు రికవరీ అయిందని అన్నారు. గతంలో జే బ్రాండ్ల కారణంగా గంజాయికి, డ్రగ్స్‌కు అలవాటు పడ్డారని, ప్రజారోగ్యంపై తీవ్రంగా ప్రభావం పడిందని అన్నారు. అలాగే స్వార్థం కోసం గత పాలకులు తెచ్చిన సొంత బ్రాండ్లు ఇప్పుడు కనిపించకుండా పోయాయని, ప్రజలు కూడా దీన్ని గుర్తించారని అన్నారు.

**మార్కెట్లో ఉన్నవి ప్రముఖ బ్రాండ్లే**

గత ప్రభుత్వ హయాంలో విక్రయించిన నకిలీ మద్యం బ్రాండ్లను ఎంత వరకు అరికట్టారని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను అడిగి తెలుసుకున్నారు. నాసిరకమైన బ్రాండ్లు ఇంకా ఏమైనా మార్కెట్‌లో కొనసాగుతున్నాయా అని సీఎం ఆరా తీశారు. గతంలో విస్తృత స్థాయిలో విక్రయించిన అనామక మద్యం బ్రాండ్లు నూతన పాలసీ అమలుతో పూర్తిగా తగ్గినట్టు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. అన్ని ప్రముఖ బ్రాండ్లు ఇప్పుడు మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయని వివరించారు. గతంలో మార్కెట్లో 68 శాతం మేర అనామక బ్రాండ్లకు చెందిన మద్యమే అందుబాటులో ఉండేదని అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం ఆ నాసిరకం బ్రాండ్ల విక్రయం జరగకుండా చూస్తున్నామని అధికారులు సీఎంకు తెలియచేశారు. దేశీయ, విదేశీ కంపెనీలకు చెందిన ప్రముఖ బ్రాండ్లన్నీ ఏపీ మార్కెట్‌లో కొనుగోలుదారులకు అందుబాటులో ఉన్నాయని వివరించారు.

**చరిత్రలో తొలిసారి తగ్గిన మద్యం ధరలు**

పేద ప్రజల జేబులు కొల్లగొట్టేలా ప్రభుత్వం వ్యవహరించకూడదు, దోపిడీ ఉండకూడదు అనే ఉద్దేశ్యంతో దేశంలో ఎక్కడా లేని విధంగా మద్యం ధరలు తగ్గించామని సీఎం అన్నారు. ఈ కారణంగా ప్రతీ నెలా కొనుగోలుదారులపై రూ. 116 కోట్ల రూపాయల మేర భారం తగ్గుతుందని అధికారులు తెలిపారు. పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ, కర్ణాటక, తమిళనాడుతో పోలిస్తే ఏపీలో విక్రయిస్తున్న టాప్ 30 బ్రాండ్ల మద్యం ధరలు తక్కువగా ఉన్నాయన్నారు. మరోవైపు పర్మిట్ రూమ్ లను అనుమతించే అంశంపై కమిటీ అధ్యయనం చేసిన అనంతరం నిర్ణయం తీసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. పర్మిట్ రూమ్లు లేకపోవడం వల్ల ఎక్కడ పడితే అక్కడ మద్యం తాగుతున్నారని, ఇది సమస్యలకు కారణం అవుతుందని అధికారులు వివరించారు. దీన్ని నివారించేందుకు పెద్ద ఎత్తున కేసులు నమోదు చేస్తున్నా, పూర్తిగా నివారించలేకపోతున్నామని, పర్మిట్ రూమ్లు ఇచ్చి అక్కడి వరకే పరిమితం చేస్తే మంచిదని అధికారులు వివరించారు. అలాగే పర్యాటక రంగానికి ఊతమిచ్చేందుకు ఆస్కారం ఉన్న ప్రాంతాల్లోనూ మైక్రో బ్రూవరీలను అనుమతించాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

**ఎక్సైజ్ ఐ ద్వారా డేగకన్ను పెట్టండి**

అబ్కారీ శాఖ‌లో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ లాంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అమలు చేసి ట్రేస్ అండ్ ట్రాకింగ్ వ్యవస్థను పటిష్టంగా అమలు చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. డిస్టిలరీల నుంచి బెవరేజెస్ కార్పోరేషన్ వరకూ అలాగే దుకాణాల వరకూ వాహనాల కదలికలపై రియల్ టైమ్ లో ట్రాకింగ్ మెకానిజం ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. జీపీఎస్ పరికరాల ద్వారా మానిటర్ చేయాలని సీఎం స్పష్టం చేశారు. అలాగే ఆన్‌లైన్ నగదు లావాదేవీలను ప్రోత్సహించాలని, డిజిటల్ లావాదేవీల విషయంలో ఎక్కడా రాజీ లేకుండా చూడాలని పేర్కొన్నారు. మరోవైపు రాష్ట్రంలో ఎక్కడా బెల్ట్ దుకాణాలు ఉండడానికి వీల్లేదని సీఎం తేల్చి చెప్పారు. డేటా అనలటిక్స్ ద్వారా ఎప్పటికప్పుడు దుకాణాల్లోని స్టాక్స్‌పై కూడా అంచనాకు రావాలని పేర్కొన్నారు. బెల్లపు ఊట, నాటు సారా తయారీ లాంటి వాటిపై డ్రోన్స్‌తో నియంత్రణ సాధించాలని స్పష్టం చేశారు. ఈ సమీక్షలో ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 
Advertisement
Chandrababu Naidu
Andhra Pradesh
AP Liquor Policy
Liquor Sales
Fake Liquor
Excise Department
NDPL
Liquor Prices
J Brands
Excise AI

More Telugu News