ప్రపంచ క్రికెట్ పగ్గాలు భారతీయుడి చేతికి.. ఐసీసీ సీఈఓగా సంజోగ్ గుప్తా నియామకం
- ఐసీసీ నూతన సీఈఓగా ఇవాళ బాధ్యతలు స్వీకరించిన సంజోగ్ గుప్తా
- ప్రపంచవ్యాప్త నియామక ప్రక్రియ ద్వారా ఏకగ్రీవంగా ఎంపిక
- స్టార్ స్పోర్ట్స్ హెడ్‌గా, ఐపీఎల్ వృద్ధిలో కీలక పాత్ర పోషించిన అనుభవం
- ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను చేర్చడమే ప్రధాన లక్ష్యమన్న గుప్తా
ఈ నియామకం కోసం ఐసీసీ మార్చిలో ప్రపంచవ్యాప్త ప్రక్రియను ప్రారంభించింది. నామినేషన్స్ కమిటీ పలువురు అభ్యర్థులను పరిశీలించి, చివరికి సంజోగ్ గుప్తా పేరును ఏకగ్రీవంగా సిఫార్సు చేసింది. ఈ సిఫార్సుకు ఐసీసీ ఛైర్మన్ జైషా ఆమోదం తెలపగా, ఐసీసీ బోర్డు దీనిని ధ్రువీకరించింది. "సంజోగ్ గుప్తా నియామకాన్ని ప్రకటించడం సంతోషంగా ఉంది. క్రీడా వ్యూహాలు, వాణిజ్యీకరణలో ఆయనకున్న అపార అనుభవం ఐసీసీకి అమూల్యమైంది. రాబోయే సంవత్సరాల్లో క్రికెట్‌ను ప్రపంచవ్యాప్తంగా విస్తరించాలనే మా ఆశయానికి ఆయన అనుభవం ఎంతగానో దోహదపడుతుంది" అని జైషా తెలిపారు.
తన నియామకంపై సంజోగ్ గుప్తా స్పందిస్తూ... "ప్రపంచవ్యాప్తంగా దాదాపు 200 కోట్ల మంది అభిమానులున్న క్రికెట్‌కు సేవ చేసే అవకాశం రావడం గర్వంగా ఉంది. లాస్ ఏంజిల్స్ 2028 ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను చేర్చడం, ఆధునిక టెక్నాలజీని వినియోగించడం ద్వారా క్రీడను మరింత ముందుకు తీసుకెళ్తాను" అని అన్నారు.
సంజోగ్ గుప్తా గతంలో జర్నలిస్టుగా తన కెరీర్‌ను ప్రారంభించి, 2010లో స్టార్ ఇండియాలో (ప్రస్తుతం జియోస్టార్) చేరారు. అక్కడ స్పోర్ట్స్ విభాగానికి హెడ్‌గా ఎదిగారు. ఐసీసీ ఈవెంట్లు, ఐపీఎల్ వంటి ప్రతిష్ఠాత్మక టోర్నీలతో పాటు పీకేఎల్, ఐఎస్ఎల్ వంటి దేశీయ లీగ్‌ల విజయవంతంలో ఆయన కీలక పాత్ర పోషించారు.