పాకిస్థాన్ ఆలయంలో ఘంటసాల పాట.. యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా వీడియోతో వెలుగులోకి!
- ఓ వ్యక్తి భక్తితో ఆలపిస్తున్న దృశ్యం
- తెలుగు రాష్ట్రాల్లో వైరల్‌గా మారిన వీడియో
- గూఢచర్యం ఆరోపణలపై యూట్యూబర్ అరెస్ట్
యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా సుమారు రెండు నెలల క్రితం పాకిస్థాన్‌లోని ప్రసిద్ధ కటాస్‌రాజ్ ఆలయ సముదాయాన్ని సందర్శించింది. ఆ పర్యటనలో భాగంగా ఆలయ విశిష్టతను వివరిస్తూ ఆమె ఓ వీడియోను చిత్రీకరించి తన యూట్యూబ్ ఛానల్‌లో అప్‌లోడ్ చేసింది. ఆ వీడియోలో 6 నిమిషాల 50 సెకన్ల వద్ద జ్యోతి మల్హోత్రా కటాస్‌రాజ్ ఆలయ ప్రాంగణంలోని ఆంజనేయస్వామి ఆలయం వైపు వెళుతుండగా ఓ అద్భుతం చోటుచేసుకుంది.
ఆలయం లోపలి నుంచి ఎవరో ఒక వ్యక్తి అత్యంత మధురంగా, భక్తిశ్రద్ధలతో ఓ తెలుగు సినిమా పాటను పాడుతుండటం స్పష్టంగా వినిపించింది. మన ఘంటసాల మాస్టారు పాడిన ‘భూకైలాస్’ చిత్రంలోని ‘రాముని అవతారం రవికుల సోముని అవతారం’ అనే సుప్రసిద్ధ గీతం. ఆలయంలో కూర్చుని ఓ పెద్దాయన ఈ పాటను ఆర్తితో ఆలపిస్తున్న దృశ్యం కూడా వీడియోలో కనిపించింది. పరాయి దేశంలో, అందులోనూ పాకిస్థాన్‌లో మన తెలుగు పాట, అదీ ఘంటసాల గళమాధుర్యాన్ని గుర్తుకుతెచ్చేలా ఓ వ్యక్తి పాడుతుండటం తెలుగువారందరినీ ఆకట్టుకుంటోంది.
వైరల్ అవుతున్న వీడియో
జ్యోతి మల్హోత్రా ఇటీవల గూఢచర్యం ఆరోపణలపై అరెస్ట్ కావడంతో ఆమె యూట్యూబ్ ఛానల్‌లోని వీడియోలపై చాలామంది దృష్టి సారించారు. ఈ క్రమంలోనే కటాస్‌రాజ్ ఆలయ వీడియోలోని ఈ అరుదైన ఘట్టం బయటకు వచ్చి, ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో వైరల్ అవుతోంది. దేశాలు వేరైనా, భాషలు వేరైనా సంగీతానికి, ముఖ్యంగా మన ఘంటసాల పాటలకు సరిహద్దులు లేవని ఈ సంఘటన నిరూపిస్తోందని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. వేరే దేశంలో తెలుగు పాట వినడమే గొప్ప అనుభూతి అయితే, పాకిస్థాన్‌లో ఘంటసాల పాట వినడం నిజంగా ఓ అద్భుతమని పలువురు పేర్కొంటున్నారు.