సంజయ్ దత్ పట్ల అభిమానాన్ని చాటుకుంటూ సల్మాన్ ఖాన్ భావోద్వేగ పోస్ట్!
- ఇటీవల సంజయ్ దత్ పుట్టినరోజుకు హాజరైన సల్మాన్
- వీరి కలయికకు సంబంధించిన చిత్రాలను పంచుకున్న సల్మాన్
- బాబా ఎప్పటికీ బాబానే అంటూ వ్యాఖ్య
తన ఆత్మీయ మిత్రుడు, సీనియర్ నటుడు సంజయ్ దత్ పట్ల తనకున్న అపారమైన అభిమానాన్ని చాటుకుంటూ బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇటీవలే జులై 29న సంజయ్ దత్ పుట్టినరోజు జరుపుకోగా, ఆయనను కలిసిన సల్మాన్ ఖాన్ గాఢంగా కౌగిలించుకుని తన ప్రేమానురాగాలను చాటుకున్నారు.
ఈ అపూర్వ కలయికకు సంబంధించిన రెండు చిత్రాలను సల్మాన్ ఈరోజు సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. బ్యాక్‌గ్రౌండ్‌లో వీరిద్దరూ కలసి నటించిన ఐకానిక్ సినిమా 'చల్ మేరే భాయ్' పాటను జోడించి మరింత ఎమోషనల్ టచ్ ఇచ్చారు.
ఈ ఫొటోలతో పాటు సల్మాన్ ఖాన్ రాసిన సందేశం అభిమానుల హృదయాలను గెలుచుకుంది. "బాబా ఎప్పటికీ బాబానే. సంజూ బాబా మనందరికీ బాబా. నా పెద్ద అన్నయ్య సంజయ్ దత్. అల్లా, భగవాన్, జీసస్... దేవుళ్లందరూ ఈ మనిషిని ఎల్లప్పుడూ సంతోషంగా ఉంచాలని కోరుకుంటున్నాను. ఐ లవ్ యూ బాబా" అని సల్మాన్ పేర్కొన్నారు.