Advertisement

విజయవాడ రైల్వే ప్రాజెక్టులపై దక్షిణ కోస్తా రైల్వే జీఎంతో చర్చించిన కేశినేని చిన్ని

Kesineni Chinni discusses Vijayawada railway projects with South Coastal Railway GM
  • విజయవాడతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులపై చర్చ
  • కొత్త లైన్లకు సంబంధించి ప్రతిపాదనలు అందించామన్న కేశినేని చిన్ని
  • 8 కొత్త రైల్వే ఓవర్ బ్రిడ్జిల నిర్మాణం చేపట్టాలని కోరామని వెల్లడి

విజయవాడ పార్లమెంట్ పరిధిలోని రైల్వే మౌలిక సదుపాయాల అభివృద్ధి, దీర్ఘకాలిక సమస్యల పరిష్కారమే లక్ష్యంగా విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని అడుగులు వేస్తున్నారు. దక్షిణ కోస్తా రైల్వే జనరల్ మేనేజర్ మాథుర్‌ను ఈరోజు ప్రత్యేకంగా కలిసిన ఎంపీ... నగరంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో పెండింగ్‌లో ఉన్న పలు కీలక రైల్వే ప్రాజెక్టులపై విస్తృతంగా చర్చించారు.


భేటీ అనంతరం కేశినేని చిన్ని మీడియాతో మాట్లాడుతూ... విజయవాడలో నిత్యం ఎదురవుతున్న ట్రాఫిక్ ఇబ్బందులను తొలగించేందుకు, కొత్త రైల్వే లైన్లు అందుబాటులోకి తెచ్చేందుకు పలు ప్రతిపాదనలు అందజేసినట్లు వెల్లడించారు. చారిత్రక, పారిశ్రామిక ప్రాధాన్యత కలిగిన కొండపల్లి రైల్వే స్టేషన్‌ను 'అమృత్ భారత్' పథకం కింద ఎంపిక చేసి ఆధునికీకరించాలని జీఎంను కోరినట్లు తెలిపారు.


విజయవాడ నగరంలో తీవ్రమవుతున్న ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారంగా వేర్వేరు ప్రాంతాల్లో 8 కొత్త రైల్వే ఓవర్ బ్రిడ్జిల నిర్మాణం చేపట్టాలని కోరినట్టు వెల్లడించారు. విజయవాడ వెస్ట్, సెంట్రల్ నియోజకవర్గాల ప్రజలకు అత్యంత కీలకమైన ఎర్రకట్ట వంతెన నిర్మాణంతో పాటు, గుణదల వద్ద ఉన్న LC-8 లెవల్ క్రాసింగ్ సమస్యను త్వరితగతిన పరిష్కరించాల్సిన అవసరాన్ని వివరించినట్టు తెలిపారు.


విజయవాడ రైల్వే స్టేషన్ ఆధునికీకరణ పనుల కోసం గతంలో టెండర్లు పిలిచినా కాంట్రాక్టర్లు ఎవరూ ముందుకు రాలేదని పేర్కొన్న ఎంపీ... త్వరలోనే ఏపీ ఎంపీలందరం కలిసి కేంద్ర రైల్వేమంత్రిని కలిసి అమృత్ భారత్ కింద నిధులు వేగంగా మంజూరయ్యేలా కోరుతామని చెప్పారు. విజయవాడ నుంచి గుత్తి మీదుగా బెంగళూరుకు నేరుగా కొత్త రైల్వే లైన్‌ను ఏర్పాటు చేయాలని కేంద్ర రైల్వే శాఖను కోరనున్నట్లు కేశినేని చిన్ని స్పష్టం చేశారు.

Advertisement
Kesineni Chinni
South Coastal Railway
Vijayawada Railway Projects
Amrit Bharat Scheme
Vijayawada Bangalore Railway Line
Kondapalli Railway Station

More Telugu News