అసెంబ్లీలో విద్వేష ప్రసంగాలకు చెక్: తెలంగాణ స్పీకర్ ఛాంబర్‌లో కమిటీ కీలక భేటీ
- అసెంబ్లీలో వ్యక్తిగత దూషణలకు చెక్ పెట్టడమే ప్రభుత్వ లక్ష్యమన్న పొన్నం ప్రభాకర్
- వారం రోజుల్లో మరోసారి భేటీ కానున్న కమిటీ
- అన్ని పార్టీల సలహాలు తీసుకుంటామన్న మంత్రి
అసెంబ్లీలో విద్వేషపూరిత, రెచ్చగొట్టే వ్యాఖ్యలను నిరోధించేందుకు తెలంగాణ ప్రభుత్వం సన్నాహకాలు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ ఛాంబర్‌లో సెలెక్ట్ కమిటీ చైర్మన్, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధ్యక్షతన ఈరోజు కీలక సమావేశం జరిగింది. ఈ భేటీకి అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌తో పాటు కమిటీ సభ్యులు దానం నాగేందర్, మధుసూదన్ రెడ్డి, యశస్విని రెడ్డి, కవ్వంపల్లి సత్యనారాయణ, కోవ లక్ష్మి, కూనంనేని సాంబశివరావు, మాణిక్ రావు హాజరయ్యారు.
సమావేశంలో విద్వేష ప్రసంగాలు, క్రైమ్ బిల్లు ప్రతిపాదనలపై సమగ్రంగా చర్చించారు. సమావేశం అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియాతో మాట్లాడుతూ... అసెంబ్లీ పరిధిలో సభ్యులు భావప్రకటనా స్వేచ్ఛను వినియోగించుకుంటూనే, ఇతరులను వ్యక్తిగతంగా దూషించడం లేదా విద్వేషపూరిత ప్రసంగాలు చేయకుండా ఉండేలా బలమైన చట్టం తీసుకురావడమే తమ కమిటీ లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు. శాసనసభ వర్షాకాల సమావేశాలు ముగిసేలోపు ఈ క్రైమ్ అండ్ హేట్ స్పీచ్ బిల్లుపై పూర్తి నివేదికను అసెంబ్లీకి సమర్పించే దిశగా కార్యాచరణ రూపొందిస్తున్నట్లు వెల్లడించారు.
వారం రోజుల్లో కమిటీ మరోసారి సమావేశం కానుంది. వివిధ రాజకీయ పార్టీలతో పాటు సమాజంలోని ప్రముఖులు, నిపుణుల సలహాలను పరిగణనలోకి తీసుకుని నివేదికను తుదిరూపు ఇస్తామన్నారు. ఈ చట్టం ఎవరి హక్కులనూ కాలరాయదని, కేవలం సభ గౌరవాన్ని, వ్యక్తుల ఆత్మగౌరవాన్ని కాపాడేందుకేనని భరోసా ఇచ్చారు.