Advertisement

ఎర్రబస్సు కూడా రాని భోగాపురానికి ఎయిర్‌బస్సు ఎందుకు? అని జగన్ ఎక్కడా అనలేదు: సజ్జల

Sajjala Ramakrishna Reddy says Jagan never asked why Airbus for Bhogapuram where red bus doesnt come
  • టీడీపీ నేతలు కావాలనే విషప్రచారం చేస్తున్నారన్న సజ్జల
  • చిన్నారి అడిగిన మాటలనే జగన్ ప్రస్తావించారని వెల్లడి
  • విమానాశ్రయం పనులు 80 శాతం వైసీపీ పాలనలోనే పూర్తయ్యాయన్న సజ్జల

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం విషయంలో అధికార తెలుగుదేశం పార్టీ నేతలు కావాలనే విషప్రచారం చేస్తున్నారని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. భోగాపురం విమానాశ్రయం అంశంపై వైసీపీని లక్ష్యంగా చేసుకుని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఘాటుగా స్పందించారు.


వైసీపీ అధినేత జగన్ వ్యాఖ్యలను టీడీపీ నేతలు ఉద్దేశపూర్వకంగా వక్రీకరిస్తున్నారని సజ్జల ధ్వజమెత్తారు. ఎర్రబస్సు కూడా రాని భోగాపురానికి ఎయిర్‌బస్సు ఎందుకు? అని జగన్ ఎక్కడా అనలేదని... ఎయిర్‌పోర్టు పనులు ప్రారంభించే సమయంలో ఓ చిన్నారి అడిగిన మాటలను మాత్రమే జగన్ ప్రస్తావించారని.. దాన్ని అధికార పార్టీ నేతలు తప్పుగా ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.


గతంలో చంద్రబాబు కేవలం ఒక నల్లరాయిని తెచ్చి హడావుడిగా శంకుస్థాపన చేసి సరిపెట్టారని సజ్జల విమర్శించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలోనే భూసేకరణ, పరిహారం చెల్లింపులు, కీలక అనుమతులన్నింటినీ క్లియర్ చేసి శరవేగంగా పనులు జరిపించామని గుర్తు చేశారు. ఎయిర్‌పోర్టుకు సంబంధించిన 80 శాతం పనులు వైసీపీ పాలనలోనే పూర్తయ్యాయని, మిగిలిన కొద్దిపాటి పనులను మాత్రమే ప్రస్తుత కూటమి ప్రభుత్వం పూర్తి చేసిందన్నారు.


కష్టమంతా ఒకరు చేస్తే ఆ క్రెడిట్ మొత్తాన్ని చంద్రబాబు చోరీ చేయడానికి ప్రయత్నిస్తున్నారని... ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా మిగిలిన పనులను పూర్తి చేయాల్సిందే కదా అని అన్నారు. భోగాపురం విమానాశ్రయం సాకారమవ్వడంలో నాటి జగన్ ప్రభుత్వ కృషి అత్యంత కీలకమైనదని సజ్జల స్పష్టం చేశారు.

Advertisement
Sajjala Ramakrishna Reddy
Bhogapuram International Airport
YS Jagan Mohan Reddy
Andhra Pradesh Politics
YSRCP vs TDP
Bhogapuram Airport Controversy

More Telugu News