Major General Karthik Seshadri: మే 8న అమృత్‌సర్‌పై పాక్ దాడి: స్వర్ణ దేవాలయాన్ని కాపాడిన భారత వాయు రక్షణ వ్యవస్థ

Indian Air Defence Foils Pakistans Attack on Golden Temple
  • మే 8న అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయంపై పాక్ దాడికి యత్నం
  • భారత దాడులకు ప్రతీకారంగానే పాక్ చర్య అని ఆర్మీ వెల్లడి
  • ముందుగానే ఊహించి స్వర్ణ దేవాలయానికి అదనపు భద్రత
  • ఆకాశ్, ఎల్-70 గన్లతో పాక్ కుట్రను భగ్నం చేసిన సైన్యం
  • "ఆపరేషన్ సిందూర్" ద్వారా పాక్‌లోని ఉగ్ర స్థావరాలపై భారత్ దాడులు
మే 8న పంజాబ్‌లోని అమృత్‌సర్‌పై పాకిస్థాన్ క్షిపణులు, డ్రోన్లతో దాడికి తెగబడింది. ఈ దాడిలో ప్రధాన లక్ష్యం పవిత్ర స్వర్ణ దేవాలయం కాగా, భారత వాయు రక్షణ దళాలు అత్యంత సమర్థవంతంగా ఈ కుట్రను భగ్నం చేసి ఆలయానికి రక్షణ కల్పించాయి. తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై భారత్ జరిపిన దాడులకు ప్రతీకారంగానే పాకిస్థాన్ ఈ చర్యకు పాల్పడినట్లు తెలుస్తోంది.

భారత సైన్యంలోని 15వ ఇన్ఫాంట్రీ డివిజన్ జనరల్ ఆఫీసర్ కమాండింగ్ (జీఓసీ) మేజర్ జనరల్ కార్తీక్ సి శేషాద్రి సోమవారం ఈ వివరాలను వెల్లడించారు. స్వర్ణ దేవాలయం లక్ష్యంగా వచ్చిన అన్ని డ్రోన్లు, క్షిపణులను ఆర్మీ ఎయిర్ డిఫెన్స్ గన్నర్లు విజయవంతంగా కూల్చివేశారని ఆయన తెలిపారు. "పాకిస్థాన్ సైన్యానికి చట్టబద్ధమైన లక్ష్యాలు ఏవీ లేవని మాకు తెలుసు. అందుకే వారు భారత సైనిక స్థావరాలు, మతపరమైన ప్రదేశాలతో సహా పౌర లక్ష్యాలపై దాడి చేస్తారని ముందే ఊహించాం. వీటిలో స్వర్ణ దేవాలయం అత్యంత ప్రధానమైనదిగా గుర్తించి, ఆలయానికి సంపూర్ణ వాయు రక్షణ కల్పించేందుకు ఆధునిక ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను అదనంగా మోహరించాం" అని మేజర్ జనరల్ వివరించారు.

మే 8న పాకిస్థాన్ మానవరహిత వైమానిక ఆయుధాలు, ప్రధానంగా డ్రోన్లు మరియు సుదూర శ్రేణి క్షిపణులతో భారీ వైమానిక దాడికి పాల్పడిందని ఆయన పేర్కొన్నారు. "దీనిని ముందే ఊహించి మేము పూర్తి సన్నద్ధతతో ఉన్నాము. మా ధైర్యవంతులైన, అప్రమత్తమైన ఆర్మీ ఎయిర్ డిఫెన్స్ గన్నర్లు పాకిస్థాన్ సైన్యం యొక్క దుష్ట పన్నాగాన్ని అడ్డుకుని, స్వర్ణ దేవాలయంపైకి వచ్చిన అన్ని డ్రోన్లు, క్షిపణులను కూల్చివేశారు. తద్వారా మా పవిత్ర స్వర్ణ దేవాలయానికి చిన్న గీత కూడా పడకుండా కాపాడాము" అని ఆయన వివరించారు.

పాకిస్థానీ క్షిపణి, డ్రోన్ దాడుల నుంచి పంజాబ్‌లోని అమృత్‌సర్‌తో పాటు ఇతర నగరాలను ఆకాశ్ క్షిపణి వ్యవస్థ, ఎల్-70 ఎయిర్ డిఫెన్స్ గన్‌లతో సహా భారతీయ వాయు రక్షణ వ్యవస్థలు ఎలా కాపాడాయో సోమవారం సైన్యం ఒక ప్రదర్శన ద్వారా వివరించింది.
Major General Karthik Seshadri
Amritsar Attack
Pakistan Drone Attack
Golden Temple
India Air Defence System
Akash Missile System
L-70 Air Defence Gun
May 8 Attack
Punjab Attack
Anti-Drone Technology

More Telugu News