ప్రధాని మోదీ నివాసంలో మరోసారి హై లెవల్ మీటింగ్
- కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘించిన పాక్
- సమీక్ష చేపట్టిన ప్రధాని మోదీ
- మోదీ నివాసంలో సమావేశానికి రాజ్ నాథ్, జై శంకర్, దోవల్ హాజరు
- హాజరైన సీడీఎస్, త్రివిధ దళాల అధిపతులు
కాల్పుల విరమణ ఒప్పందం శనివారం ప్రకటించగా, అదే రోజు రాత్రి పాకిస్థాన్ ఒప్పంద నిబంధనలను ఉల్లంఘించిందని భారత్ ఆరోపించింది. ఈ ఉల్లంఘనలను పరిష్కరించడానికి తక్షణమే తగిన చర్యలు తీసుకోవాలని, పరిస్థితిని తీవ్రంగా, బాధ్యతాయుతంగా ఎదుర్కోవాలని పాకిస్థాన్‌ను భారత్ కోరినట్లు సమాచారం.
ఆపరేషన్ సిందూర్ అనంతరం పాకిస్థాన్.. జమ్మూకశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్‌లోని కొన్ని ప్రాంతాలపై డ్రోన్ దాడులకు పాల్పడింది. భారత రక్షణ వ్యవస్థలు ఈ డ్రోన్లను సమర్థవంతంగా అడ్డుకున్నప్పటికీ, అణ్వస్త్ర దేశాలైన ఇరు దేశాల మధ్య ఘర్షణలు మరింత తీవ్రమవుతాయేమోనన్న భయాలు వ్యక్తమయ్యాయి. అయితే, కొద్ది గంటల తర్వాత పరిస్థితి కొంత చల్లబడినప్పటికీ, సరిహద్దు ప్రాంతాల్లోని ప్రజలు మాత్రం ఇంకా భయాందోళనలతోనే గడుపుతున్నారు.
మోదీ నివాసంలో జరుగుతున్న తాజా సమావేశంలో సరిహద్దుల్లో శాంతిభద్రతల పరిరక్షణ, భవిష్యత్ కార్యాచరణపై కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్టు తెలుస్తోంది.