Advertisement

రఘురామపై సీబీఐకి ఫిర్యాదు చేసిన మాజీ ఐపీఎస్ పీవీ సునీల్ కుమార్

Raghurama Krishna Raju faces CBI complaint from former IPS PV Sunil Kumar
  • వేల కోట్ల రూపాయల కేసుల్లో సాక్షులను రఘురామ బెదిరిస్తున్నారని ఆరోపణ
  • రఘురామను అరెస్టు చేయాలంటూ బీఎన్ఎస్ఎస్ చట్టాన్ని ప్రస్తావించిన వైనం
  • దర్యాప్తు సమగ్రతను కాపాడాలని సీబీఐ డైరెక్టర్‌కు విజ్ఞప్తి
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుపై మాజీ సీఐడీ చీఫ్ పీవీ సునీల్ కుమార్ సంచలన ఆరోపణలు చేశారు. రెండు కీలకమైన సీబీఐ కేసుల్లో సాక్షులను బెదిరిస్తూ, సాక్ష్యాధారాలను తారుమారు చేసేందుకు రఘురామ ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తూ ఆయన సీబీఐ డైరెక్టర్‌కు లేఖ రాశారు. ఈ వ్యవహారంలో తక్షణమే జోక్యం చేసుకోవాలని, రఘురామపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.

సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ (SFIO) కోరిన రికార్డుల విషయంలో రఘురామకృష్ణరాజు తనను కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించారని, తన ప్రాణాలకు ముప్పు ఉందని మాదల శ్రీనివాస్ అనే వ్యక్తి పట్టాభిపురం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు ఓ పత్రికలో వచ్చిన కథనాన్ని సునీల్ కుమార్ తన ఫిర్యాదులో ప్రస్తావించారు. వేల కోట్ల రూపాయల ఆర్థిక నష్టానికి సంబంధించిన రెండు సీబీఐ కేసుల నేపథ్యంలో ఈ సంఘటనను అత్యంత తీవ్రంగా పరిగణించాలని ఆయన పేర్కొన్నారు.

2019లో నమోదైన కేసులో రూ.947.71 కోట్లు, 2021 నాటి మరో కేసులో రూ.237.84 కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారనే ఆరోపణలపై రఘురామపై సీబీఐ కేసులు నమోదయ్యాయని సునీల్ కుమార్ తెలిపారు. ఈ కేసుల దర్యాప్తు కొనసాగుతుండగా, సాక్షులను ప్రభావితం చేయడం, రికార్డులను మాయం చేయడం వంటివి దర్యాప్తు సమగ్రతను దెబ్బతీస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు.

కొత్తగా అమల్లోకి వచ్చిన భారతీయ నాగరిక్ సురక్షా సంహిత (BNSS), 2023లోని సెక్షన్ 35 ప్రకారం.. సాక్షులను బెదిరించినా, సాక్ష్యాలను నాశనం చేసినా అరెస్టుతో సహా కఠిన చర్యలు తీసుకునే అధికారం దర్యాప్తు సంస్థలకు ఉందని సునీల్ కుమార్ తన లేఖలో స్పష్టం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో వెంటనే స్పందించకపోతే, ఇతర సాక్షులు కూడా భయపడి దర్యాప్తునకు సహకరించరని, ఇది దర్యాప్తు సంస్థల నిష్పాక్షికతపై ప్రజల్లో నమ్మకాన్ని తగ్గిస్తుందని హెచ్చరించారు. "న్యాయం జరగడమే కాదు, జరిగినట్లుగా కనిపించాలి" అని ఆయన ఉద్ఘాటించారు.

ఈ ఘటనను పరిగణనలోకి తీసుకుని, సంబంధిత రికార్డులు, ఎలక్ట్రానిక్ ఆధారాలను భద్రపరచాలని, సాక్ష్యాలను తారుమారు చేసే ప్రయత్నం జరిగిందా అనే కోణంలో విచారణ జరపాలని, అవసరమైతే బీఎన్ఎస్ఎస్ చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని సునీల్ కుమార్ సీబీఐని కోరారు. రఘురామపై ఈ కేసులు ఎంపీగా ఉన్నప్పుడు నమోదయ్యాయి.

కాగా, వైసీపీ హయాంలో చంద్రబాబుతో పాటు ఇతర నేతలపై అవినీతి ఆరోపణలతో కేసులు నమోదు చేసిన సమయంలో సునీల్ కుమార్ సీఐడీ చీఫ్‌గా ఉన్నారు. 2024లో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన్ను ప్రాధాన్యం లేని పోస్టుకు బదిలీ చేశారు. ఆ తర్వాత ఆయన సర్వీసు నుంచి స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. 


Advertisement
Raghurama Krishna Raju
PV Sunil Kumar
CBI Complaint
Witness Intimidation
Evidence Tampering
Andhra Pradesh Politics

More Telugu News