బలూచిస్థాన్ ఎప్పుడో పాకిస్థాన్ చేజారిపోయింది: పాక్ మాజీ ప్రధాని షాహిద్ అబ్బాసీ సంచలన వ్యాఖ్యలు
- పాకిస్థాన్ నుంచి బలూచిస్థాన్ వేరుపడే అవకాశం ఉందన్న అబ్బాసీ
- భద్రత లేకుండా నాయకులు అక్కడ తిరగలేని పరిస్థితి ఉందని వ్యాఖ్య
- బలూచ్ లో పలు ప్రాంతాలపై పాకిస్థాన్ కు పట్టులేదని వెల్లడి
- బలూచ్ పోరాట యోధులు బహిరంగంగానే గస్తీ నిర్వహిస్తున్నారన్న అబ్బాసీ
- క్వెట్టాలో చీకటి పడితే ప్రభుత్వ ఉనికి కనుమరుగు అవుతోందన్న మాజీ ప్రధాని
కేవలం 1,500 మంది మాత్రమే బలూచిస్తాన్‌లో అశాంతికి కారణమవుతున్నారన్న పాక్ సైన్యాధిపతి అసిమ్ మునీర్ వ్యాఖ్యలను అబ్బాసీ తోసిపుచ్చారు. "అది ఆయన వ్యక్తిగత అభిప్రాయం కావచ్చు, కానీ క్షేత్రస్థాయిలో చూసిన వాస్తవాలను నేను చెబుతున్నాను" అని అబ్బాసీ స్పష్టం చేశారు. బలూచ్ సాయుధ పోరాట యోధులు ఇప్పుడు ప్రావిన్స్ అంతటా బహిరంగంగా గస్తీ నిర్వహిస్తున్నారని, సొంతంగా చెక్‌పోస్టులు ఏర్పాటు చేసుకుని పట్టణాలను తమ ఆధీనంలోకి తీసుకుంటున్నారని ఆయన వివరించారు. ప్రావిన్స్ మొత్తం భయం, అనిశ్చితితో కొట్టుమిట్టాడుతోందని, ప్రభుత్వ అధికారులు, రాజకీయ నాయకులు రక్షణ లేకుండా బయట తిరగలేని వాతావరణం నెలకొందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌పై అనర్హత వేటు పడిన అనంతరం, పాకిస్థాన్ ముస్లిం లీగ్-నవాజ్ (PML-N) పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తూ షాహిద్ ఖాకాన్ అబ్బాసీ ఆగస్టు 2017 నుంచి మే 2018 వరకు పాకిస్థాన్ ప్రధానమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. అయితే, 2024లో ఆయన పీఎంఎల్-ఎన్ పార్టీ నుంచి బయటకు వచ్చారు.
బలూచిస్థాన్ ప్రావిన్స్ వ్యూహాత్మకంగా పాకిస్థాన్ కు అత్యంత కీలకమైనది. చైనా-పాకిస్థాన్ ఎకనామిక్ కారిడార్ (CPEC) ప్రాజెక్టులో ఈ ప్రాంతం గుండెకాయ వంటిది. చైనా ఇక్కడ గ్వదార్ ఓడరేవును కూడా నిర్మిస్తోంది. అయినప్పటికీ, ప్రస్తుతం అక్కడ పాకిస్థాన్ ప్రభుత్వ అధికారం నామమాత్రంగానే ఉంది. విస్తారమైన ఖనిజ సంపద, సహజవాయువు నిక్షేపాలు కలిగిన బలూచిస్థాన్... పాకిస్థాన్ లోనే అతిపెద్ద రాష్ట్రం కావడం గమనార్హం. అయితే, ఇక్కడ జనాభా చాలా తక్కువ. ఈ ప్రాంతంపై పాక్ ప్రభుత్వం అనుసరిస్తున్న అణచివేత విధానాల కారణంగా బలూచ్ ప్రజలు దశాబ్దాలుగా స్వాతంత్ర్యం కోసం పోరాటం చేస్తున్నారు. తాజా పరిణామాలు ఈ పోరాటానికి మరింత ఆజ్యం పోస్తున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.