Prakash Raj: పాకిస్థాన్ నటుడికి మద్దతు... మరో వివాదంలో ప్రకాశ్ రాజ్

- పాక్ నటుడు ఫవాద్ ఖాన్ సినిమాపై నిషేధం
- సినిమా విడుదల చేసి, ఆదరణ నిర్ణయాన్ని ప్రేక్షకులకే వదిలేయాలన్న ప్రకాశ్ రాజ్
- సోషల్ మీడియాలో నెటిజన్ల నుంచి తీవ్ర విమర్శలు
సినీ నటుడు ప్రకాశ్ రాజ్ తాజాగా చేసిన కొన్ని వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. పాకిస్థానీ నటుడు ఫవాద్ ఖాన్ నటించిన సినిమాను భారతదేశంలో నిషేధించడంపై ఆయన భిన్నాభిప్రాయం వ్యక్తం చేశారు. కశ్మీర్‌లో ఇటీవలి ఉగ్రదాడి నేపథ్యంలో నెలకొన్న సున్నిత పరిస్థితుల్లో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇటీవల కశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిన విషయం తెలిసిందే. ఈ దాడిని తీవ్రంగా పరిగణించిన కేంద్ర ప్రభుత్వం, ప్రతిస్పందనగా పాకిస్థాన్‌పై పలు ఆంక్షలు విధించింది. ఇందులో భాగంగా పాకిస్థానీ నటులు నటించిన సినిమాలను భారత్‌లో విడుదల చేయకుండా నిలిపివేయాలని నిర్ణయించింది.
ఈ నేపథ్యంలో, ఫవాద్ ఖాన్ హీరోగా నటించిన 'అబిర్ గులాల్' అనే సినిమా విడుదలపై కూడా నిషేధం కొనసాగుతోంది. దీనిపై తాజాగా ఒక ఇంటర్వ్యూలో ప్రకాశ్ రాజ్ స్పందించారు. "ఫవాద్ ఖాన్ సినిమాను ఇండియాలో నిషేధించడం సరైనదిగా అనిపించడం లేదు. ముందు సినిమాను విడుదల చేస్తే, ప్రేక్షకులు పాకిస్థానీ నటుల సినిమాలను ఆదరిస్తారో లేదో స్పష్టమవుతుంది. ఫలితాన్ని వారికే వదిలేయడం మంచిది" అని ప్రకాశ్ రాజ్ అభిప్రాయపడ్డారు.
ఉగ్రదాడి ఘటనతో దేశ ప్రజలు ఆగ్రహంతో ఉన్న సమయంలో, పాకిస్థానీ నటుడి సినిమా విడుదల గురించి ప్రకాశ్ రాజ్ మాట్లాడటం తీవ్ర విమర్శలకు దారితీసింది. ఆయన వ్యాఖ్యలను నెటిజన్లు తప్పుబడుతున్నారు. దేశభద్రత, ప్రజల మనోభావాల కంటే సినిమాల విడుదల ముఖ్యమా? అని ప్రశ్నిస్తున్నారు. పాకిస్థానీ నటులకు పరోక్షంగా మద్దతు ఇవ్వడమేంటని, ఇలాంటి వ్యాఖ్యలు చేసే ముందు ఆలోచించాలని పలువురు సోషల్ మీడియా వేదికగా తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రకాశ్ రాజ్‌ను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు.