పహల్గామ్ దాడిలో ఒక ముస్లింను కూడా చంపిన ఉగ్రవాదులు.. కారణం ఇదే!
- పర్యాటకులను కాపాడేందుకు ప్రయత్నించి ప్రాణాలు కోల్పోయిన కశ్మీరీ హార్స్ రైడర్
- ఉగ్రవాది దగ్గరున్న తుపాకీ లాక్కునేందుకు ప్రయత్నించడంతో కాల్పులు
- కుటుంబానికి ఏకైక ఆధారమైన అదిల్ మృతితో విషాదంలో తల్లిదండ్రులు, భార్యాపిల్లలు
ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. ఉగ్రవాదులు కాల్పులు జరిపే సమయంలో స్థానిక యువకుడు, హార్స్ రైడర్ సయ్యద్ అదిల్ హుస్సేన్ షా అక్కడే ఉన్నాడు. ఉగ్రవాదుల నుంచి పర్యాటకులను కాపాడేందుకు ప్రయత్నించాడు. తన ప్రాణాలను లెక్కచేయకుండా ఓ ఉగ్రవాది చేతిలోని రైఫిల్ ను లాక్కునేందుకు సయ్యద్ అదిల్ ప్రయత్నించాడు. మండిపడ్డ ఉగ్రవాదులు అతడిపై కాల్పులు జరిపారు. దీంతో సయ్యద్ అదిల్ అక్కడికక్కడే మరణించాడు.
ఈ ఘటనతో అదిల్ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. వృద్ధులైన తల్లిదండ్రులు, భార్య, పిల్లలు ఉన్న అతడి కుటుంబానికి అదిల్ ఒక్కడే ఆధారం. అతడి మరణంతో ఆ కుటుంబం జీవనాధారం కోల్పోయి దిక్కుతోచని స్థితిలో పడింది. "నిన్న పని కోసం పహల్గామ్ వెళ్ళాడు. మధ్యాహ్నం 3 గంటలకు దాడి జరిగిందని తెలిసింది. ఫోన్ చేస్తే స్విచాఫ్ వచ్చింది. 4:40కి ఫోన్ ఆన్ అయినా ఎవరూ తీయలేదు. పోలీస్ స్టేషన్ కు వెళితే గాయపడ్డాడని తెలిసింది. ఆ తర్వాత చనిపోయాడని చెప్పారు. ఈ దారుణానికి పాల్పడిన వారికి శిక్ష పడాలి" అని అదిల్ తండ్రి సయ్యద్ హైదర్ షా మీడియా ముందు కన్నీటిపర్యంతమయ్యారు.