బయటకు వచ్చిన పహల్గాం ఉగ్రవాది తొలి ఫొటో... నెట్టింట వైరల్!
- పర్యాటకులపై కాల్పులు జరిపిన ఓ ఉగ్రవాది తొలి ఫొటోను బయటపెట్టిన జాతీయ మీడియా
- ఫొటోలో రైఫిల్ పట్టుకుని పరిగెత్తుతూ కనిపించిన ఉగ్రవాది
- ఈ ఫొటోను కశ్మీర్ పోలీసులు... సీఆర్‌పీఎఫ్, సైన్యంతో పంచుకున్న వైనం
జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్‌లో మంగళవారం జరిగిన పాశవిక దాడిలో కనీసం 26 మంది మరణించగా, పదుల సంఖ్యలో గాయపడినట్లు సమాచారం. కాగా, ఈ దాడిలో 8-10 మంది ఉగ్రమూకలు పాల్గొన్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. వారిలో 5-7 మంది దాయాది పాకిస్థాన్ నుంచి వచ్చినట్లు పేర్కొంటున్నాయి. కాల్పుల తర్వాత సమీపంలోని అడవిలోకి పారిపోయారు. వారి కోసం భద్రతా బలగాలు గాలిస్తున్నాయి.
ఇక, ట్రెక్కింగ్ యాత్ర కోసం సుందరమైన బైసరన్ లోయను సందర్శిస్తున్న పర్యాటకుల బృందాన్ని లక్ష్యంగా చేసుకుని ఈ దాడి జరిగిందని అధికారులు నిర్ధారించారు. గుర్తు తెలియని దుండగులు ఉన్నట్టుండి ఒక్కసారిగా సందర్శకులపై కాల్పులకు తెగబడ్డారు. దీంతో ఆ ప్రాంతంలో భయాందోళనలు నెలకొన్నాయి.