వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్ట్‌ను ధ్రువీకరించిన అసెంబ్లీ సచివాలయం

AP Assembly Secretariat confirms arrest of YSRCP MLA Virupakshi
  • ఆలూరు వైసీపీ ఎమ్మెల్యే బూసినే విరూపాక్షి అరెస్ట్
  • టీడీపీ కార్యకర్తలపై దాడి కేసులో అదుపులోకి తీసుకున్న పోలీసులు
  • ఎమ్మెల్యేపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు
  • సభ్యుడి అరెస్టుపై అధికారిక బులెటిన్ విడుదల చేసిన అసెంబ్లీ
కర్నూలు జిల్లా ఆలూరు వైసీపీ ఎమ్మెల్యే బూసినే విరూపాక్షి అరెస్టును ఆంధ్రప్రదేశ్ శాసనసభ ధ్రువీకరించింది. ఈ మేరకు ఏపీ శాసనసభ సెక్రటరీ జనరల్ కార్యాలయం సోమవారం ఒక బులెటిన్ విడుదల చేసింది. టీడీపీ కార్యకర్తలపై దాడికి సంబంధించిన కేసులో ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే.

బులెటిన్ వివరాల ప్రకారం.. ఆగస్టు 2వ తేదీ తెల్లవారుజామున 3 గంటల సమయంలో కర్నూలు జిల్లా చిప్పగిరిలోని నివాసంలో ఆలూరు సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ఎమ్మెల్యే విరూపాక్షిని అరెస్ట్ చేశారు. ఆయనపై చిప్పగిరి పోలీస్ స్టేషన్‌లో భారతీయ న్యాయ సంహిత (BNS)లోని పలు సెక్షన్ల కింద క్రైమ్ నెం. 37/2024 నమోదు కాగా, మరో కేసులో (క్రైమ్ నెం. 38/2024) ఆయనను ఏ-1గా పేర్కొంటూ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం కింద కూడా కేసు నమోదు చేశారు.

గత శనివారం చిప్పగిరి మండలం నెమకల్లు, సంగాల గ్రామాల్లో ఎమ్మెల్యే విరూపాక్షి, ఆయన అనుచరులు టీడీపీ కార్యకర్తలపై దాడికి పాల్పడ్డారని ఆరోపణలు ఉన్నాయి. పలువురు టీడీపీ కార్యకర్తల ఇళ్లపైకి వెళ్లి మహిళలు, పురుషులపై భౌతిక దాడులకు పాల్పడ్డారని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఈ ఫిర్యాదుల ఆధారంగా పోలీసులు ఎమ్మెల్యే సహా మొత్తం 34 మందిపై కేసులు నమోదు చేశారు. వీరిలో ఇప్పటికే 16 మందిని అరెస్ట్ చేసి ఆలూరు కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం వారికి రిమాండ్ విధించింది. ఈ క్రమంలోనే ఎమ్మెల్యే విరూపాక్షిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిబంధనల ప్రకారం, సభ్యుడి అరెస్టుకు సంబంధించిన వివరాలను శాసనసభ సచివాలయం అధికారికంగా వెల్లడించింది.                              
Advertisement
Busine Virupakshi
YSRCP MLA Arrest
AP Assembly Secretariat
Kurnool Police
TDP Workers Attack
SC ST Atrocity Case

More Telugu News