K Kavitha: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని చైనా ఫోన్‌తో పోల్చిన కవిత

Kavitha compares Revanth Reddy with china phone
షార్ట్స్‌లో చూడండి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత చైనా ఫోన్‌తో పోల్చారు. జగిత్యాలలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ, ఐఫోన్‌కు, చైనా ఫోన్‌కు ఎంత తేడా ఉందో, కేసీఆర్‌కు రేవంత్ రెడ్డికి అంతే తేడా ఉందని ఆమె ఎద్దేవా చేశారు. చైనా ఫోన్ చూడటానికే బాగుంటుందని, కానీ సరిగ్గా పని చేయదని అన్నారు. మాటలు చెప్పి బీసీల ఓట్లు వేయించుకొని బురిడీ కొట్టించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏ కులంలో ఎంత జనాభా ఉందో లెక్కలు ఎందుకు బయట పెట్టడం లేదని ప్రశ్నించారు.

మంత్రి పొన్నం ప్రభాకర్ బీసీ సంఘాల నేతలతో తూతూమంత్రంగా సమావేశం నిర్వహించారని, వారితో స్వయంగా ముఖ్యమంత్రి ఎందుకు సమావేశం కావడం లేదని ప్రశ్నించారు. బీసీ ఉద్యమం చేస్తున్న నాయకులతో ముఖ్యమంత్రి మాట్లాడకపోవడం బీసీలను అవమానించడమే అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇవ్వాల్సిందేనని, లేదంటే ఉద్యమం తప్పదని హెచ్చరించారు.

మరో తెలంగాణ పోరాటం తరహా ఉద్యమానికి బీసీ సంఘాలు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. తప్పుడు జనాభా లెక్కలతో బీసీ సమాజం ఆగ్రహంతో ఉందని ఆమె అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే బీసీ కుల సంఘాల నాయకులతో చర్చలు జరపాలని ఆమె డిమాండ్ చేశారు. బీసీలు 52 శాతం ఉన్నారని 2014లోనే కేసీఆర్ లెక్క తేల్చారని, కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం తప్పుడు లెక్కలు చెబుతోందని విమర్శించారు. ఈ తప్పుడు లెక్కలను చెప్పి రాహుల్ గాంధీ పార్లమెంట్‌ను తప్పుదోవ పట్టించారని ఆమె ఆరోపించారు.

420 హామీలు ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని నెరవేర్చకుండా ప్రజలను వంచించిందన్నారు. ఎండిన పంటపొలాలను చూస్తుంటే కన్నీళ్లు వచ్చే పరిస్థితి నెలకొందన్నారు. కేసీఆర్‌పై అక్కసుతో మేడిగడ్డ ప్రాజెక్టును వినియోగించడం లేదని విమర్శించారు. రాజకీయ కక్షలను పక్కన పెట్టి కాళేశ్వరం నుండి నీటిని విడుదల చేయాలని ఆమె డిమాండ్ చేశారు. ఆడపిల్లలకు స్కూటీలు, మహిళలకు రూ.2,500 వంటి హామీలు అమలు చేయడం లేదని విమర్శించారు.
Go Back to Shorts
K Kavitha
Telangana
BRS
Revanth Reddy

More Telugu News