నేడు బెలగావికి వెళుతున్న రేవంత్ రెడ్డి, మంత్రులు, పీసీసీ చీఫ్
- బెలగావిలో రెండు రోజుల పాటు సీడబ్ల్యూసీ ప్రత్యేక సమావేశాలు
- ప్రత్యేక విమానంలో బెలగావికి వెళ్తున్న కాంగ్రెస్ ప్రముఖులు
- సమావేశాలకు 'నవ సత్యాగ్రహ బైఠక్' అని నామకరణం చేసిన కాంగ్రెస్
మహాత్మాగాంధీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించి వందేళ్లు పూర్తయ్యాయి. బెలగావిలోనే ఆయన కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలను స్వీకరించారు. ఈ నేపథ్యంలో ఈ నెల 26, 27 తేదీల్లో సీడబ్ల్యూసీ ప్రత్యేక సమావేశాలను నిర్వహిస్తోంది. ఈ సమావేశాలకు కాంగ్రెస్ పార్టీ 'నవ సత్యాగ్రహ బైఠక్' అని నామకరణం చేసింది.
ఈ సమావేశాలకు సీడబ్ల్యూసీ సభ్యులు, శాశ్వత ఆహ్వానితులు, ప్రత్యేక ఆహ్వానితులు, ముఖ్యమంత్రులు, మాజీ సీఎంలు, పార్లమెంటరీ పార్టీ ఆఫీస్ బేరర్లు, పీసీసీ చీఫ్ లు, సీఎల్పీ నేతలు సహా దాదాపు 200 మంది కీలక నేతలు హాజరుకానున్నారు.