Pakistan: ఆ ఆట‌గాళ్ల‌కు పీసీబీ వార్నింగ్‌.. ఫిట్‌నెస్ లేక‌పోతే ఉద్వాస‌న త‌ప్ప‌ద‌న్న క్రికెట్ బోర్డు!

Improve Fitness Or Contract Termination PCB Warns Centrally Contracted Players
పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) 6-7 మంది సెంట్ర‌ల్‌ కాంట్రాక్టు ఉన్న‌ ఆటగాళ్లకు హెచ్చరికలు జారీ చేసింది. ఫిట్‌నెస్ ప్ర‌మాణాలు పాటించ‌ని వారిని జ‌ట్టు నుంచి త‌ప్పిస్తామ‌ని తేల్చిచెప్పింది. ఫిట్‌నెస్‌ను మెరుగుపరచుకోవాలని, లేనిప‌క్షంలో ఆయా ఆట‌గాళ్లు కాంట్రాక్టులను కోల్పోయే ప్రమాదం ఉందని పేర్కొంది. 

ఈ నెల ప్రారంభంలో జరిగిన ఫిట్‌నెస్ టెస్ట్‌లలో కొంతమంది ఆటగాళ్లు విఫ‌ల‌మ‌య్యారు. పాకిస్థాన్ జట్టు ఫిట్‌నెస్ ట్రైనర్, ఫిజియోథెరపిస్ట్ సోమవారం లాహోర్‌లో మరో రౌండ్ ఫిట్‌నెస్ పరీక్షలను నిర్వహించనున్నారు. ఈ నేప‌థ్యంలోనే పీసీబీ త‌మ ఆట‌గాళ్ల‌ను హెచ్చ‌రించింది. 

"కేంద్ర, దేశీయ కాంట్రాక్టులను కలిగి ఉన్న ఆటగాళ్లకు ఫిట్‌నెస్ విష‌య‌మై ఎటువంటి రాజీ ఉండదు. వారు జట్టు ఫిట్‌నెస్ నిపుణులు నిర్దేశించిన బెంచ్‌మార్క్‌లకు అనుగుణంగా ఫిట్‌నెస్ ప్ర‌మాణాలను క‌లిగి ఉండాలి" అని బోర్డు అధికారి ఒకరు తెలిపారు.

ఇద్దరు విదేశీ ప్రధాన కోచ్‌లు జాసన్ గిల్లిస్పీ, గ్యారీ కిర్‌స్టన్‌లు ఫిట్‌నెస్ స్థాయులకు సంబంధించినంతవరకు ఏ ఆటగాడికి ఎలాంటి ప్రయోజనం ఇవ్వకూడదని పీసీబీ ఛైర్మన్‌కి చెప్పినట్లు అధికారి పేర్కొన్నారు.

ఇక ఈ ఫిట్‌నెస్ పరీక్షలు అనేవి ప్లేయ‌ర్ల‌ స్టామినా, కండరాల బలం, ఇతర కీలకమైన అంశాలను అంచనా వేయడానికి ఉద్దేశించనవి.

ఈ ఏడాది ప్రారంభంలో ఫిట్‌నెస్ పరీక్షల్లో బెంచ్‌మార్క్‌ను అందుకోవ‌డంలో ఇబ్బంది పడుతున్న ఆటగాళ్లకు వారి ఫిట్‌నెస్‌ను మెరుగుప‌ర‌చుకోవ‌డానికి రెండు నెలల సమయం ఇచ్చామని, సోమవారం జరిగే పరీక్షలు వారికి కీల‌క‌మ‌ని అధికారి తెలిపారు. ఇందులో విఫ‌ల‌మైతే ఆట‌గాళ్లకు ఉద్వాస‌న త‌ప్ప‌ద‌ని తేల్చిచెప్పారు.   

కాగా, ఇతర అంతర్జాతీయ జట్లతో పోలిస్తే పాకిస్థాన్ జట్టు ఫిట్‌నెస్ ప్రమాణాల విష‌యంలో తరచూ విమర్శలను ఎదుర్కొంటున్న విష‌యం తెలిసిందే. పాక్ ప్లేయ‌ర్లు ఫిట్‌నెస్ విష‌యంలో అల‌స‌త్వం ప్ర‌ద‌ర్శింస్తుంటార‌ని ఆ దేశ మాజీ ఆటగాళ్లు కూడా ప‌లు సంద‌ర్భాల్లో పేర్కొన‌డం జ‌రిగింది. వారి ఫిట్‌నెస్‌ను మెరుగుప‌రిచేందుకు ఏకంగా ఆర్మీతో ట్రైనింగ్ కూడా ఇప్పించింది పీసీబీ.
Pakistan
PCB
Cricket
Sports News

More Telugu News