ఎమర్జెన్సీ రాజ్యాంగ విరుద్ధమేమీ కాదు: శశి థరూర్
- ఎమర్జెన్సీ విధింపునకు నాటి రాజ్యాంగ నిబంధనలు అవకాశం ఇచ్చాయన్న కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్
- ఎమర్జెన్సీ అప్రజాస్వామికం కావచ్చేమో కానీ రాజ్యాంగ విరుద్ధం కాదని వ్యాఖ్య
- రాహుల్ ఓ నాయకుడిగా ఎదిగారని కితాబు
- సెంగోల్ వివాదంలో తాను తటస్థంగానే ఉండదలుచుకున్నట్టు స్పష్టీకరణ
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, స్పీకర్ ఓం బిర్లా ప్రసంగాల్లో ఎమర్జెన్సీ ప్రస్తావనపై స్పందించిన శశిథరూర్... 49 ఏళ్ల నాటి ఘటనను బీజేపీ మళ్లీ ఎందుకు తిరగదోడుతోందని ప్రశ్నించారు. వాస్తవం గురించి మాట్లాడకుండా బీజేపీ 2047 లేదా 1975 నాటి ఘటనల గురించే మాట్లాడుతోందని విమర్శించారు. ఒకప్పుడు రాజ్యాంగంలో అంతర్గత ఎమర్జెన్సీ విధింపునకు అవకాశం ఉండేదని, కాబట్టి అప్పట్లో ఆ నిర్ణయం రాజ్యాంగ బద్ధమేనని అన్నారు. ప్రస్తుతం దాన్ని తొలగించారని అన్నారు. కాబట్టి, చట్టపరంగా చూస్తే ద్రౌపది ప్రసంగంలో ఎమర్జెన్సీ రాజ్యాంగ విరుద్ధమనడం సరికాదని అన్నారు.
బ్రిటిష్ నుంచి భారత్‌కు అధికారం బదలాయింపునకు చిహ్నంగా ఉన్న సెంగోల్‌కు బదులు రాజ్యాంగం కాపీని తీసుకురావాలన్న ఎస్పీ వాదనపై కూడా శశిథరూర్ స్పందించారు. సెంగోల్‌కు అనుకూల ప్రతికూల వాదనలు రెండూ ఆమోదించదగ్గవేనని అన్న ఆయన ఈ విషయంలో తాను తటస్థంగానే ఉండదలచినట్టు వివరించారు.
లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడి బాధ్యతలు స్వీకరించిన రాహుల్ గాంధీపై కూడా శశిథరూర్ స్పందించారు. రాహుల్ ఓ నాయకుడిగా ఎదిగారన్నారు. భారత్ జోడో యాత్రలతో పరిస్థితి మారిందన్నారు. యువత దృష్టి ఆయనవైపు మళ్లిందన్నారు. రాహుల్ తన సూచనలు తీసుకోవాల్సిన అవసరం లేదని, ఆయన నాయకుడిగా మంచి విజయాలు సాధిస్తున్నాడని అన్నారు. ప్రతిపక్ష నాయకుడి హోదాలో ప్రజల కోసం పనిచేసే అద్భుత అవకాశం రాహుల్‌కు దక్కిందని అభిప్రాయపడ్డారు.