ఒక్క నిమిషం నేను రాజశేఖర్ రెడ్డి బిడ్డను కాదనుకుంటాను... రండి చూసుకుందాం: నగరిలో సవాల్ విసిరిన షర్మిల
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఒక్క నిమిషం నేను రాజశేఖర్ రెడ్డి బిడ్డను కాదనుకుంటాను... రండి చూసుకుందాం: నగరిలో సవాల్ విసిరిన షర్మిల

Sharmila challenges YCP leaders in Nagari
  • రోజా ఇలాకాలో నిప్పులు చెరిగిన షర్మిల
  • రోజమ్మా... నోరుంది కదా అని పారేసుకోవద్దని హితవు
  • పక్క రాష్ట్రంలో ఇలా మాట్లాడినవాళ్లు ఓడిపోయి కూర్చున్నారని ఎద్దేవా
  • రేపు మీ పరిస్థితి కూడా అంతేనని స్పష్టీకరణ 
ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల నేడు నగరిలో రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా వైసీపీ నేతలకు ఘాటు హెచ్చరికలు చేశారు. లోకల్ ఎమ్మెల్యే, మంత్రి రోజాపైనా ఆమె విరుచుకుపడ్డారు. 

"రోజమ్మా... నోరుంది కదా అని పారేసుకోవద్దు... పక్క రాష్ట్రంలో మొన్నటి వరకు నాపై నోరు పారేసుకున్న వారందరూ ఓడిపోయి ఇళ్లలో కూర్చున్నారు... రేపు మీ పరిస్థితి కూడా అంతే అని స్పష్టం చేశారు. 

ఇంకొకరు... నేను రాజశేఖర్ రెడ్డి బిడ్డను కాబట్టి బాపట్ల నుంచి అవతలికి అడుగుపెట్టనిచ్చాం అని అంటున్నారు. ఒక్క నిమిషం నేను రాజశేఖర్ రెడ్డి బిడ్డను కాదనుకుందాం... రండి, ఎంతమంది వస్తారో రండి... చూసుకుందాం. ఏం చేస్తారో చేయండి... మీ దమ్మేందో చూపించండి. 

సిగ్గుండాలి కదా... రాజశేఖర్ రెడ్డి పేరుతో, రాజశేఖర్ రెడ్డి ఆశయాల కోసం నిలబడ్డామని చెప్పుకుంటూ ఇంత దయనీయంగా, ఇంత దరిద్రంగా ఆడ, మగ తేడా లేకుండా నీచంగా వ్యవహరించారు. ఈ ఐదేళ్లలో అన్ని మాటలు తప్పారు. రాజశేఖర్ రెడ్డి సంక్షేమ పాలనకు, జగనన్న పాలనకు పోలికే లేదు. ప్రతి మాట తప్పారు. 

ఇప్పుడు నేనొచ్చి ఇక్కడ తప్పులను ఎత్తిచూపుతున్నానని, చెల్లెల్ని అనే ఇంగితం లేకుండా వ్యవహరిస్తున్నారు. 3,200 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ఇదే పార్టీ (వైసీపీ)ని నేను నా భుజాల మీద మోశాను. సమైక్యాంధ్ర కోసం తిరిగాను, ఓదార్పు యాత్ర చేశాను, బై బై బాబు క్యాంపెయిన్ చేశాను. ఎక్కడ అవసరం వస్తే అక్కడ నా సేవలు అందించాను. నాకు ఈ పదవి కావాలి అని అడగలేదు. 

ఆ పార్టీ (వైసీపీ) ఓ మొక్కగా ఉన్నప్పుడు నా చేతులతో నీళ్లు పోశాను, ఎరువు వేశాను, కాపాడాను. ఇప్పుడా పార్టీ ఓ చెట్టు అయింది. చెట్టయ్యాక నా అవసరమే లేదంటున్నారు కదా! మీ మాటలతో మీ అహంకారం ఎంతో తెలుస్తోంది. ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. మళ్లీ చెబుతున్నా... నేను ప్రజల కోసమే వచ్చాను" అంటూ షర్మిల తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
Advertisement
YS Sharmila
Roja
Nagari
Congress
YSRCP
Andhra Pradesh

More Telugu News